శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్‌లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.

దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.
Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.

‘రాజా 50’ ఫీనిక్స్‌లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమానికి ఫీనిక్స్‌లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.
ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.

ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు.


