కువైట్‌లో భారీ డీజిల్‌ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్‌! | Kuwait Diesel Theft Gang 41 Arrested Indian Expats | Sakshi
Sakshi News home page

కువైట్‌లో భారీ డీజిల్‌ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్‌!

Sep 8 2026 2:56 AM | Updated on Sep 8 2026 2:56 AM

Kuwait Diesel Theft Gang 41 Arrested Indian Expats

కువైట్‌ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్‌ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్‌ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్‌ చేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్‌’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్‌ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్‌ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్‌ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్‌ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్‌ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే, డీజిల్‌ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవీ చదవండి: లెబనాన్‌పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్‌.. 11 మంది మృతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement