ఘటనా స్థలిని పరిశీలించిన అధికారుల బృందం
వారం రోజులైనా చిక్కని దొంగలు.
కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సైనిక స్థావరంలో ఆయుధాల చోరీ వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా స్థానిక పోలీసులు గానీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు గానీ ఎలాంటి పురోగతి సాధించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, సేకరించిన కీలక ఆధారాలు, అనుమానితుల వివరాలను త్వరలోనే ఎన్‌ఐఏకు బదిలీ చేయనున్నారు. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది.
అసలు ఏం జరిగింది?
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ క్యాంపస్‌లో ఆగస్టు 30 రాత్రి అత్యంత భద్రత ఉండే ఆయుధాగారంలోకి దుండగులు చొరబడ్డారు. చుట్టూ ఉన్న ముళ్లకంచెను ఏవిధంగానూ ధ్వంసం చేయకుండా లోపలికి ప్రవేశించిన దొంగలు, ఆయుధాలు భద్రపరిచే ‘కోట్’, మందుగుండు సామగ్రి ఉండే ‘బెటాలియన్ మేగజైన్’గదుల తాళాలు బద్దలు కొట్టారు. అక్కడ ఉన్న అనేక ఆయుధాలలో నుంచి ఎంచుకుని మరీ 4 ఏకే–203 రైఫిళ్లు, 1 ఇన్సాస్ రైఫిల్, 7 పిస్టళ్లు, 1,800 రౌండ్లకు పైగా మందుగుండు సామగ్రిని దొంగిలించారు. అదే ప్రాంతంలో లైట్ మెషీన్ గన్స్ ఉన్నప్పటికీ దుండగులు వాటిని ముట్టుకోకపోవడం గమనార్హం.
సైనిక పహారా ఉన్నా..
చోరీ జరిగిన రెండు గదులు 40 మీటర్ల పరిధిలోనే ఉండగా.. పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నారు. 2 గంటల షిఫ్టుల్లో డ్యూటీ చేసిన గార్డులు.. తాము ఎలాంటి అనుమానాస్పద కదలికలు గానీ, శబ్దాలు గానీ గుర్తించలేదని పోలీసులకు చెప్పారు. ఆ రాత్రి పడిన భారీ వర్షం వల్ల శబ్దాలు వినబడలేదని, ఆ గదులు తమకు నేరుగా కనిపించే కోణంలో లేవని విచారణలో పేర్కొన్నారు. చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి మొత్తం బరువు దాదాపు 40 కిలోలకు పైగానే ఉంటుంది.
ఒకే వ్యక్తి అంతటి బరువును మోసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ఇందులో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉండవచ్చని లేదా విడతలవారీగా చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్మీ ప్రాంగణంలో భద్రతా తనిఖీలు ఎప్పుడు నిర్వహించారనే దానిపై సరైన రికార్డులు లేకపోవడంపై దర్యాప్తు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సైనిక స్థావరం భౌగోళిక రూపురేఖలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
దొరికింది చోరీకి గురైంది కాదు..
చోరీకి గురైన ఆయుధాల జాడ కోసం పోలీసులు వెతుకుతున్న క్రమంలో ఆర్మీ క్యాంపస్ లోని డ్రైనేజీలో ఇన్సాస్ రైఫిల్ మేగజైన్ ఒకటి పోలీసులకు లభ్యమైంది. అయితే ఆ మేగజైన్ చోరీకి గురైన వాటిల్లోని సీరియల్ నంబర్ మేగజైన్ కాకపోవడంతో పోలీసులు కంగుతిన్నారు. దర్యాప్తులో అధికారులను తప్పుదోవ పట్టించేందుకే వేరే మేగజైన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


