నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలో తెలంగాణ నీటి వాటా కోసం అన్ని వేదికలపై సమర్థంగా పోరాటం చేస్తున్నామని, ఈ విషంలో బీఆర్‌ఎస్, ఇతర ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నదీజలాల విషయంలో ఎలాంటి రాజీపడకుండా ట్రిబ్యునల్స్, కేఆర్‌ఎంబీ, కేంద్రప్రభుత్వం వద్ద తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తోందన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో నీటిపారుదల శాఖను భ్రష్టు పట్టించిందని, కోటి 81 లక్షల రూపాయలు ఖర్చు చేసి అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. రూ.80 వేల కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఈ రెండు ప్రాజెక్టులతో ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని ఉత్తమ్ తెలిపారు. గౌరవెల్లి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, తామ చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పూర్తిచేసి రైతులకు సాగు నీరందిస్తామన్నారు.


