బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో హరీశ్‌రావు, బండా ప్రకాశ్, మధుసూదనాచారి, కేటీఆర్, సబితారెడ్డి
పార్టీ ఎవరికి బీఫాం ఇచ్చినా గెలిచే పరిస్థితి: బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
సాగునీటి కోసం లక్షలాది మందితో త్వరలో ప్రత్యక్ష కార్యాచరణ
హామీల అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగం, తాగునీరు, ఉద్యోగుల సమస్యలపైనా పోరాటం
అసెంబ్లీ, మండలిలో ప్రజల గొంతు వినిపించాలి.. కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డిపై ప్రభుత్వాన్ని నిలదీయాలి
ఎర్రవెల్లిలో నేతలకు అధినేత దిశానిర్దేశం
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం.
–కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా మళ్లీ బీఆర్‌ఎస్ సునామీ రాబోతోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అయింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎవరికి బీఫాం ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది. అలా అని పార్టీ నేతలు, కార్యకర్తలు రిలాక్స్ కావొద్దు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పోరాడాలి..’ అని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో.. అసెంబ్లీ, మండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
థర్డ్‌క్లాస్ పాలన..రైజింగ్ కాదు డౌన్‌ఫాల్
‘కాంగ్రెస్‌ది థర్డ్‌క్లాస్ పాలన. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్ వైపు వెళ్లింది. కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని అర్థమైంది. అందుకే ఆ పార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్ వైపు వెళ్లింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని అధికార పక్షం బూతు కూతలకు వేదికగా మార్చింది. పాలన చేతకాక చిల్లర మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ప్రజల గొంతును ఉభయ సభల్లో బలంగా వినిపించే బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉంది. ప్రజల జెండానే బీఆర్‌ఎస్ ఎజెండాగా ఉండాలి., ప్రతి చర్చలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా పాల్గొనాలి. శాసనమండలి కూడా పాత భవనంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు సభల్లో పార్టీ సభ్యులు మరింత సమన్వయంతో వ్యవహరించాలి..’ అని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.
ఎన్డీఎస్‌ఏ చెప్పినా కాళేశ్వరంపై నిర్లక్ష్యం
కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగించుకోవచ్చని కోవచ్చని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మేడిగడ్డ వద్ద అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుంది. అయినా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తెలంగాణ పంటలకు విడుదల చేయడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి అంశాలపై అవసరమైతే ఉభయ సభలను స్తంభింపజేయాలి. వీటి విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం..’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
విద్య, ఉద్యోగాలపై సర్కారును నిలదీయాలి
‘పేద విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై విద్యార్థుల తరఫున అసెంబ్లీ వేదికగా గళం విప్పాలి. పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసేలా జీవో 97 తీసుకొచ్చిన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలి. ఎన్నికలకు ముందు లక్షలాది ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎందుకు విఫలమైందో నిలదీయాలి. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రయత్నాలు, గురుకులాల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులు, బాలికల మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయాలి. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి అత్యవసర పరిస్థితుల్లోనూ విక్రయించుకోలేని పరిస్థితి కల్పించడంపైనా పోరాడాలి.
ప్రభుత్వాన్ని ఎండగట్టాలి..
మిషన్ భగీరథ వ్యవస్థను నిర్వీర్యం చేసి తాగునీటి సమస్యను తీవ్రతరం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ఉచిత విద్యుత్‌కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ వంటి బకాయిలు చెల్లించకపోవడం, పీఆర్సీ పెండింగ్, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం, సింగరేణిలో అవినీతి, ప్రభుత్వ భూముల విక్రయాలు, మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం, గోదావరి–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ఉభయ సభల్లో ప్రశ్నించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మహిళలపై దాడులు పెరగడం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాలపైనా కాంగ్రెస్‌ను ఎండగట్టాలి..’ అని కేసీఅర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేకపోయిన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకత్వం, కార్యకర్తలను అభినందించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కేసీఆర్ కోరగా.. ప్రస్తుత సభ గౌరవ సభగా కాకుండా ‘కౌరవ సభ’గా మారిందని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది.


