ఆరు ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు కేంద్రం తలుపులు తెరిచింది. ఇప్పుడు అదే నిర్ణయం ఇస్రోలో కొత్త చర్చకు తెరతీసింది. రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, లాంచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ వంటి కీలక బాధ్యతలు క్రమంగా ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. అసలు కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి? ఇస్రో భవిష్యత్ పాత్ర ఏమిటి? తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలతో ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి వి. నారాయణన్‌కు లేఖ రాశాయి. ప్రైవేటీకరణ విధానం, ఇస్రో భవిష్యత్ పాత్ర, ప్రస్తుత ఉద్యోగుల పరిస్థితి, భవిష్యత్ నియామకాలపై అధికారిక వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
సెప్టెంబర్ 4న ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్‌కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఇటీవల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. భవిష్యత్‌లో ఇస్రో స్వయంగా లాంచ్ వెహికల్స్ తయారు చేయదని.. వాటి తయారీ మొత్తం ప్రైవేటు రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని గోయెంకా పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్పు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)తో ప్రారంభమైందని.. భవిష్యత్‌లో PSLV, LVM3 వంటి కీలక రాకెట్ల తయారీకి కూడా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?
లాంచ్ వెహికల్స్ తయారీ, సాధారణ ఉపగ్రహాల ఉత్పత్తిని ఇస్రో నుంచి బయటకు తరలించడం, కులశేఖరపట్నంలో ప్రతిపాదిత స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ వంటి కొత్త మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలకు తెరవడంపై కూడా ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పటికే ఇస్రోకు చెందిన దాదాపు 120 సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసినట్లు లేఖలో పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై అధికారిక విధాన పత్రం లేకపోవడం ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో ఆందోళనకు కారణమవుతోందని సంఘాలు తెలిపాయి. ఇస్రోలో అంతర్గత పనులు తగ్గిపోతే ఉద్యోగుల సంఖ్యపై కోత పడే అవకాశం ఉందని, ప్రమోషన్లు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా దెబ్బతినవచ్చని పేర్కొన్నాయి.
‘ఇది కేవలం తయారీ కాంట్రాక్ట్ కాదు’
లాంచ్ వెహికల్ డిజైన్, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగాలు.. ఇవి కేవలం తయారీ కాంట్రాక్టులు కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఇవే ఇస్రోకు ఉన్న ప్రధాన సాంకేతిక సామర్థ్యం, దశాబ్దాలుగా ఏర్పడిన సంస్థాగత అనుభవం, వ్యూహాత్మక సామర్థ్యమని పేర్కొన్నాయి. అయితే ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి తాము వ్యతిరేకం కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. NSIL ద్వారా నిర్ణీత విధానంలో వాణిజ్య కార్యకలాపాలు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని తెలిపాయి. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, ఇస్రో సొంత తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించడం మధ్య స్పష్టమైన గీత ఉండాలని డిమాండ్ చేశాయి.
నారాయణన్‌కు కీలక ప్రశ్నలు
ఇదే ఇప్పుడు ఉద్యోగ సంఘాల ప్రధాన ఆందోళన. రాకెట్ డిజైన్ చేయడం మాత్రమే కాదు.. దాని తయారీ, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగం వరకు మొత్తం ప్రక్రియలో ఇస్రోకు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ పనులు బయటకు వెళ్లిపోతే ఇస్రో కేవలం పరిశోధన, డిజైన్ సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గోయెంకా వ్యాఖ్యలు నిజంగా కేంద్ర ప్రభుత్వ విధానమేనా? లేక వ్యక్తిగత అభిప్రాయమా? PSLV, LVM3, SSLVతో పాటు భవిష్యత్ లాంచ్ వెహికల్స్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగ బాధ్యతలు ఇస్రో వద్దే కొనసాగుతాయా? అనే అంశాలపై అధికారిక స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. మొత్తంగా, అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరించే కేంద్రం విధానంపై ఇస్రో ఉద్యోగుల్లోనే ప్రశ్నలు తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం విధానం ఏంటి?
కేంద్రం తీసుకున్న దిశ మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. 2023 స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు మరింత పెద్ద పాత్ర కల్పించింది. NSIL వాణిజ్యీకరణ, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుండగా.. IN-SPACe ప్రైవేటు సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహం, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. 2025-26లో IN-SPACe, NSIL, ISRO కలిసి 100 టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందాలు పూర్తి చేశాయని కేంద్రం తెలిపింది. SSLV టెక్నాలజీని HALకు బదిలీ చేయడం ఇందులో అత్యంత కీలకమైన ఉదాహరణగా నిలిచింది. PSLV, LVM3 టెక్నాలజీ బదిలీకి కూడా ప్రక్రియ మొదలైంది. అయితే ఇస్రో పూర్తిగా రాకెట్ల తయారీ నుంచి వైదొలగుతుందా? అన్న అంశంపై ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు కోరుతున్న స్థాయిలో స్పష్టమైన అధికారిక వివరణ వెలువడలేదనే అంశమే ప్రస్తుత వివాదానికి కేంద్రంగా ఉంది.
ఇదీ చదవండి: గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి


