విశ్వాసం పెంచిన ఆర్థిక వృద్ధి  | PM Narendra Modi hits out at critics over abow 7 percent GDP growth Rate | Sakshi
Sakshi News home page

విశ్వాసం పెంచిన ఆర్థిక వృద్ధి 

Sep 6 2026 4:46 AM | Updated on Sep 6 2026 5:47 AM

PM Narendra Modi hits out at critics over abow 7 percent GDP growth Rate

ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 7.8 శాతం వృద్ధి సాధించాం  

దేశాన్ని దిగజార్చిన వారు నేటి ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారు   

వారి దృష్టిలో గ్లాసు ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుంది 

ప్రతిపక్షాలపై నరేంద్ర మోదీ ఆగ్రహం   

‘శ్రీరామ్‌ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌’ వందేళ్ల వేడుకలో పాల్గొన్న ప్రధాని

న్యూఢిల్లీ:  భారతదేశ ఆర్థిక వృద్ధి, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలపై ఆరోపణలు చేస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చినవారే.. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించడాన్ని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 

శనివారం ఢిల్లీలో శ్రీరామ్‌ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌ వందేళ్ల వేడుకలో ప్రదానమంత్రి పాల్గొన్నారు. ఆయన ఈ కళాశాలకు రావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్యానికి అంతరాయాలు ఉన్నప్పటికీ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో భారత్‌ 7.8 శాతం వృద్ధి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి దేశ విశ్వాసాన్ని పెంచిందన్నారు. 

మన దేశాన్ని అత్యంత బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల(ఫ్రాౖజైల్‌ ఫైవ్‌) జాబితాలోకి నెట్టి అపఖ్యాతి పాలైన వారికి నేడు ఈ గణాంకాలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 2013లో తాను ఈ కాలేజీలో చేసిన ప్రసంగం అప్పట్లో ఒక అలజడిని సృష్టించిందని, 13–14 ఏళ్లు గడిచినప్పటికీ దాని ప్రభావం నేటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక దార్శనికతను(విజన్‌) ఆవిష్కరించానని అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి మాటా తన దృఢ విశ్వాసానికి నిదర్శనమని, ఆ మాటలకు అనుగుణంగానే ఎప్పుడూ జీవించానని ఉద్ఘాటించారు.  

నక్సలిజం నడ్డి విరిగింది  
2013 నాటి ఆర్థిక పరిస్థితులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. అప్పట్లో బలహీనమైన రూపా యి, దాదాపు 10 శాతం ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి కరెంట్‌ అకౌంట్‌ లోటు, మందగించిన పారిశ్రామిక వృద్ధి, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడాన్ని ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందన్నారు. ప్రపంచం భారత్‌ను ఫ్రాౖజైల్‌ ఫైవ్‌లో ఒకటిగా పిలిచేదని చెప్పారు. అప్పట్లో కుంభకోణాలు తారస్థాయికి చేరాయని, అవినీతిపరులు నిర్భయంగా తిరిగేవారని వెల్లడించారు. ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని, పాకిస్తాన్‌పై నియంత్రణ తప్పిందని విమర్శించారు. 

కానీ, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు నేడు చిత్తుగా ఓడిపోయారని, పాకిస్తాన్‌ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత సైన్యం వారి గడ్డపైకే వెళ్లి దాడులు చేస్తోందని తెలిపారు. నక్సలిజం నడ్డి విరిగిందన్నారు. విధానపరమైన స్తబ్దత నుంచి చైతన్యవంతమైన విధానాల అమలు వరకు భారత్‌ ఎంతో పురోగతి సాధించిందని స్పష్టంచేశారు. ఈ రోజు భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడాన్ని ప్రపంచం చూస్తోందని వెల్లడించారు. తాజా జీడీపీ గణాంకాలు దేశ ఆ ర్థిక బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలియజేశారు. దేశం వృద్ధి చెందడమే కాకుండా నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు.  

దేశం ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా చాలా సురక్షితంగా ఉందని చెప్పారు. ఇది చూసిన తర్వాత కొందరిలో అసహనం పెరుగుతోందన్నారు. అలాంటి దిమాగీ నక్సలైట్లకు ఎర్రకోట(స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం) నుంచే హోమియోపతి మందు ఇచ్చానని వ్యాఖ్యానించారు. దిమాగీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్న వారి నిజ స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సేవలు, అవకాశాల కోసం సామాన్య పౌరులు మాయి–బాప్‌(తల్లి–తండ్రి) సంస్కృతిపై ఆధారపడి ఉండాలని కొందరు కోరుకుంటున్నారని, అందుకే ఆర్థిక సమ్మిళితాన్ని వ్యతిరేకిస్తున్నారని మోదీ ఆరోపించారు. ‘మాయి–బాప్‌’ సంస్కృతిని సమర్థించేవారికి ఎదురుగా తాను ఒక బండరాయిలా నిలబడతానని ప్రధాన మంత్రి తేల్చిచెప్పారు. 

యువతను ఆకట్టుకొనే యత్నం  
‘జెన్‌ జెడ్‌’ను ఆకట్టుకొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. నేటి తరం యువ తకు బాగా తెలిసిన ‘ఓజీ’ వంటి పదాలను తన ప్రసంగంలో చేర్చారు. ‘దురంధర్‌’ అనే సినిమా ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. శ్రీరామ్‌ కాలేజీ పూర్వ విద్యార్థులు ఓజీలు(అసలైన దిగ్గజాలు) అని ప్రశంసించారు. వారు దురంధర్‌లు కాకపోయినా ఎన్నో సంచలనాలు సృష్టించారని చెప్పారు.  

సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవదు  
కొందరు వ్యక్తులు దేశ పురోగతి పట్ల నిరాశావాదంతో ఉన్నారని మోదీ విమర్శించారు. ‘సగం నిండిన గ్లాసు’ ఉపమానాన్ని ప్రస్తావించారు. కొందరు గ్లాసును సగం నిండినట్లుగా, మరికొందరు సగం ఖాళీగా ఉన్నట్లుగా చూస్తారని చెప్పారు. అయితే, తాను మాత్రం గ్లాసు పూర్తిగా నిండినట్లుగా, అందులో సగ భాగం నీరు, సగ భాగం గాలి ఉన్నట్లుగా భావిస్తానని వివరించారు. 2013లో గ్లాసు సగం ఖాళీగా ఉందని భావించినవారు ఇప్పటికీ దేశాన్ని అదే దృక్పథంతో చూస్తున్నారని ఆక్షేపించారు. వారి దృష్టిలో గ్లాసు ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుందన్నారు. తాను కేవలం గ్లాసు గురించే మాట్లాడుతున్నానని, ఖాళీగా ఉండే మరో దాని గురించి కాదని ప్రతిపక్షాలపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. తన ప్రసంగాన్ని ‘రిపోర్ట్‌ కార్డు’గా మోదీ అభివరి్ణంచారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీపై పరోక్షంగా విమర్శలు చేశారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవలేదని తేల్చిచెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement