సుప్రీంకోర్టు నెలవారీ లెక్చర్‌ సిరీస్‌  | Supreme Court is set to launch a Monthly Lecture Series on Law, Justice | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు నెలవారీ లెక్చర్‌ సిరీస్‌ 

Sep 6 2026 5:13 AM | Updated on Sep 6 2026 5:44 AM

Supreme Court is set to launch a Monthly Lecture Series on Law, Justice

న్యాయ, న్యాయవిద్య, సామాజికాంశాలపై లెక్చర్లు 

న్యాయ శిక్షా సమ్మాన్‌ పేరుతో వార్షిక అవార్డు 

న్యూఢిల్లీ: చట్టం, న్యాయం, సమాజాల్లోని సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చ కొనసాగే లక్ష్యంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక వినూత్నమైన ఆలోచనకు తెరలేపింది. న్యాయం, న్యాయ విద్య, సమకాలీన సామాజిక అంశాలపై నిపుణుల చేత నెలకు ఒక ఉపన్యాసం ఇప్పించనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శనివారం ఈ నెలవారీ ఉపన్యాసాల కార్యక్రమాన్ని ప్రకటించారు.

 దీంతోపాటే వార్షిక అవార్డు ఒకదాన్ని కూడా అందివ్వనున్నట్లు తెలిపారు. ‘ప్రతి నెలా...ఒక ముఖ్యమైన ఆలోచన.’అనే భావనతో రూపొందిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పండితులు, యువ న్యాయ ప్రతిభలు పాల్గొంటారు. నెలనెలా ఒక ప్రముఖ న్యాయవేత్త లేదా నిపుణుడు ఉపన్యాసం ఇస్తారు. దానిపై చర్చ, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమాన్ని రికార్డు చేసి సవరించిన ప్రతులు, సంక్షిప్త నివేదికలు అందుబాటులో ఉంచనున్నారు. 

ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమూ చేస్తారు. న్యాయవిద్యలో అత్యున్నత నైపుణ్యాన్ని గుర్తించేందుకు ‘సుప్రీం కోర్టు న్యాయ శిక్షా సమ్మాన్‌’పేరుతో ఏటా ఒక అవార్డు అందివ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. ఉపన్యాస శ్రేణిలో మొదటి కార్యక్రమం ఇదే నెలలో జరగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా అర్థవంతమైన చర్చ, న్యాయపరమైన అంశాల్లో లోతైన ఆలోచన, దేశ చట్టం, న్యాయాల భవిష్యత్తును రూపొందించే అంశాల్లో విస్తృత భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement