హెచ్చరిక జారీ చేసిన డబ్ల్యూఎంఓ
వచ్చే ఏడాది వరకూ కొనసాగే అవకాశం
భారత్‌పై ప్రభావం తీవ్రం
రానున్న మూడు నెలలు భగభగలు!
ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారతదేశానికి అంతర్జాతీయ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది మొదలైన ఎల్–నినో వచ్చే ఏడాది మొదటి వరకూ కచ్చితంగా కొనసాగుతుందని హెచ్చరించింది. ఫలితంగా మరిన్ని వాతావరణ విపత్తులు, వడగాడ్పులు, అకాల వర్షాలు, వరదలు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణ అమెరికా వద్ద భూమధ్య రేఖ ప్రాంతంలోని పసఫిక్ మహా సముద్రపు ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగితే దాన్ని ఎల్–నినో అంటారన్నది తెలిసిన విషయమే. నాలుగైదేళ్ల విరామంతో వచ్చే ఈ వాతావరణ దృగ్విషయం ప్రపంచ వాతావరణంపై మరీ ముఖ్యంగా భారతదేశానికి కీలకమైన నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎల్‌నినో వచ్చిన సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండటమే కాకుండా... వడగాడ్పులు పెరుగుతూంటాయి.
అకాల వర్షాలు, వరదలు నమోదవుతూంటాయి. 2026లోనూ ఎల్–నినో ఏర్పడిందని, ఇది చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండవచ్చునన్న అంచనాలను ప్రపంచ వాతావరణ సంస్థ ఈ ఏడాది మధ్యలోనూ ఇచ్చింది. అయితే తాజాగా గురువారం జారీ చేసిన ప్రకటనలో మాత్రం ఈసారి సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడటం వందకు వంద శాతం పక్కా అని తేల్చి చెప్పింది. చరిత్రలోనే అతిపెద్ద ఎల్–నినోగా అవతరించనుందని, 2027 ఫిబ్రవరి నెల వరకూ ఈ పరిస్థితులు కొనసాగవచ్చని స్పష్టం చేసింది. పసఫిక్ మహా సముద్ర ప్రాంతంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో ఉండటం దీనికి కారణమవుతోందని తెలిపింది.
రెండున్నర డిగ్రీలు ఎక్కువ...
పసఫిక్ మహా సముద్రంలో ఎల్–నినో పరిస్థితులను అంచనా కట్టేందుకు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటారు. అలాంటి ప్రాంతాల్లో ఒకటైన ‘ద నినో 3.4’లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా అసాధారణంగా ఉన్నట్లు తెలిసింది. మే–జూలై నెల మొదటి వరకూ ఇక్కడి ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటే జూలై నెలలో రెండు డిగ్రీలకు పెరిగింది. ఆ తరువాత వారం వారం ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదై ఆగస్టు మధ్యకు 2.6 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకున్నట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది.
ఉపరితలంతోపాటు దిగువభాగంలోనూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎనిమిది డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఎల్–నినో మరింత బలపడేందుకు కారణమవుతున్నాయని, 2026 ఆఖరుకు పతాక స్థాయికి చేరుతుందని వివరించింది. డబ్ల్యూఎంఓ అంచనాల ప్రకారం ఎల్–నినోల వివరాలు నమోదు చేయడం మొదలుపెట్టిన 1950 నుంచి తీసుకున్నా ఈ ఏడాది అతి బలమైన నాలుగు ఎల్‌నినోల్లో ఒకటిగా నిలుస్తుందని హెచ్చరించింది.
ఒక్క తీరుగా ఉండని ప్రభావం...
ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ఒకే తీరైన ప్రభావం చూపకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. బలం ఆధారంగా ఏ దేశంపై ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా చెప్పలేము. భారత దేశం విషయానికి వస్తే... చాలా సందర్భాల్లో ఎల్‌నినో తీవ్రత నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం చూపింది. ఎల్‌నినో సంవత్సరాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే కొన్ని సంవత్సరాల్లో దీనికి భిన్నమైన పరిస్థితులూ ఏర్పడటం గమనార్హం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
ఇందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లోనూ చాలా చోట్ల వర్షాలు తక్కువగానే కురిశాయి. ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణం కంటే 16 శాతం తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎంఓ సూపర్ ఎల్‌నినో పక్కా అని, 2027 ఫిబ్రవరి వరకూ కొనసాగవచ్చునన్న ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. దీనర్థం... రానున్న మూడు నెలలు దేశంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. హిందూ మహాసముద్రంలో పరిస్థితుల్లో ఏదైనా మార్పు వస్తే ఎల్‌నినో స్థితిగతుల్లోనూ తేడాలు వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఎల్ నినో కారణంగా వచ్చే ఏడాది రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని
అంచనా.
‘‘స్పానిష్ భాషలో ఎల్‌నినో అంటే చిన్న బాలుడని అర్థం. కానీ... వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేయగల సత్తా ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరవు కాటకాలు, కార్చిచ్చులు, వరదలు నమోదవుతున్నాయి. ఎన్‌నినో తీవ్రతతోపాటు ఇవి కూడా మరింత ప్రమాదకరంగా మారనున్నాయి. ఈ అసాధారణ ఎల్‌నినో పరిస్థితులను అంతేస్థాయిలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. డబ్ల్యూఎంఓ యాభై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో జాతీయ వాతావరణ సంస్థలు, జలవనరుల సేవలను అప్రమత్తం చేస్తున్నాం. మానవ ప్రాణ, జీవనోపాధి మార్గాలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందించేది వీరే. ఐక్యరాజ్య సమితికి చెందిన అన్ని మానవీయ సేవల సంస్థలతో కలిసి పని చేసేందుకు డబ్ల్యూఎంఓ కట్టుబడి ఉంది. వాతావరణానికి సంబంధించిన సమాచారం, విపత్తుల నిర్వహణలో సాయం, వ్యవసాయం, ఆరోగ్యం, జలవనరుల నిర్వహణలో సాయం అందిస్తాం. వృథా చేసేంత సమయం లేనేలేదిప్పుడు’’
– డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టీ సాలో
– సాక్షి, నేషనల్ డెస్క్


