వికసిత భారత్‌కు వాహన రంగం దన్ను! | PM Narendra Modi urges auto industry innovation for Viksit Bharat | Sakshi
Sakshi News home page

వికసిత భారత్‌కు వాహన రంగం దన్ను!

Sep 4 2026 1:58 AM | Updated on Sep 4 2026 1:58 AM

PM Narendra Modi urges auto industry innovation for Viksit Bharat

నిరంతర ఆవిష్కరణలతో దూసుకెళ్లాలి... 

సాహసోపేతమైన మార్గాన్ని రూపొందించుకోవాలి... 

సియామ్‌ సదస్సులో ఆటోమొబైల్‌ పరిశ్రమకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: నిరంతర ఆవిష్కరణలు, అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తూ 2047 నాటికి వికసిత (అభివృద్ధి చెందిన) భారత్‌ సాకారం దిశగా సాహసోపేతమైన మార్గాన్ని రూపొందించుకోవాలని భారత వాహన పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గురువారమిక్కడ జరిగిన భారతీయ వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) 2026 వార్షిక సదస్సుకు అందించిన సందేశంలో, ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మన వాహన రంగం దూసుకెళ్లేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన పరిశ్రమ మరింతగా విస్తరించేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని చెప్పారు. సియామ్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు. ‘వికసిత భారత్‌ జర్నీలో వాహన రంగానికి కొంగొత్త అవకాశాలు లభిస్తాయి.  భారీగా వృద్ధి  చెందుతుంది. దేశాభివృద్ధిలో కీలక మూల స్తంభంగా రవాణా రంగం పాత్ర బలోపేతమవుతుంది. గడిచిన దశాబ్దకాలంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తోంది. ఎకానమీ ప్రగతితో పాటు వాహనాలకు డిమాండ్‌ కూడా పుంజుకుంటుంది. హైవేలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణ జోరుతో మన ఆటోమొబైల్‌ పరిశ్రమకు మరిన్ని కొత్త అవకాశాలు దక్కుతున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

ఈవీలు రయ్‌... 
దేశంలో చార్జింగ్‌ సదుపాయాల విస్తరణ జోరందుకోవడంతో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని.. ఇది ఆవిష్కరణల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. నవతరం మొబిలిటీ దిశగా భారత్‌ దూసుకెళ్తున్న నేపథ్యంలో భారతీయ వాహన తయారీ సామర్థ్యాలను సరికొత్త శిఖరాలను తీసుకెళ్లడంలో సియామ్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీమ్‌ల వంటి చర్యలతో వాహన పరిశ్రమ తయారీ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయని వివరించారు. 

ఆర్థిక వృద్ధికి కీలక చోదకం: సియామ్‌ ప్రెసిడెంట్‌ 
భారత్‌ ఆర్థిక ప్రగతికి ఆటోమొబైల్‌ పరిశ్రమ కీలక చోదకంగా నిలుస్తుందని సియామ్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు. పర్యావరణహితమైన, కాలుష్యరహిత, సురక్షిత రవాణా విషయంలో ప్రపంచవ్యాప్త, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం చేయడంలో గణనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ ఎకానమీలో వాహన పరిశ్రమ వాటా రూ.22.75 లక్షల కోట్లను అధిగమించిందని, జీఎస్‌టీ వసూళ్లలో ఈ రంగం నుంచి దాదాపు 15% లభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఆటో పరిశ్రమ ఉపాధి కల్పిందని చెప్పారు. 2025–26లో 46 లక్షల విక్రయాలు.. 7.6% వృద్ధితో ప్యాసింజర్‌ వాహన విభాగం రికార్డు సృష్టించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25 లక్షల ఈవీలు  (24.7% వృద్ధి) అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు.  

పెట్రోలు, డీజిల్‌ కార్లపై మరిన్ని నియంత్రణలు... 
దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీని మరింత పెంచేందుకు వాహన రంగం చర్యలు తీసుకోవాలని ప్రధాని సలహాదారు తరుణ్‌ కపూర్‌ పరిశ్రమను కోరారు. దేశీయంగా బ్యాటరీ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను సంబంధిత మార్పులను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించిందని కూడా ఆయన పేర్కొన్నారు. మరోపక్క, రానున్న కాలంలో పెట్రోలు, డీజిల్‌ వాహనాలు.. ముఖ్యంగా కార్ల విషయంలో ప్రభుత్వం మరిన్ని నియంత్రణలను అమలు చేసే అవకాశం ఉందని.. పరిశ్రమ దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. సీఎన్‌జీ వాహనాలపై దృష్టి సారించినట్లే... రానున్న కాలంలో ఈవీలపై ఫోకస్‌ మరింత పెంచాలని ఆటోమొబైల్‌ కంపెనీలకు సూచించారు. మరోపక్క, మరికొన్నేళ్లలో ఈవీలపై ప్రభుత్వం సబ్సిడీలను ఆపేయవచ్చని, పరిశ్రమ ఈ సవాలుకు రెడీగా ఉండాని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కమ్రాన్‌ రిజ్వీ పేర్కొన్నారు.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌సీఏపీ 2.0: గడ్కరీ 
దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే చర్యల్లో భాగంగా వాహనాల్లో పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థను అంచనా వేసే భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) 2.0ను వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే, రేర్‌ ఎమిషన్‌ కంట్రోల్‌ పరికరం వల్ల కాలుష్యం భారీగా తగ్గుతుందని, దీనిపై పరీక్షలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. ఒక్కో డివైజ్‌కు రూ.4,000–5,000  ఖర్చవుతుందన్నారు. బీఎస్‌4 వాహనాల్లో దీన్ని అమర్చిన తర్వాత వెలువడే ఉద్గారాలు బీఎస్‌6 వాహనాల మాదిరిగానే ఉంటాయన్నారు. త్వరలో దీనికి సంబంధించి కొత్త స్కీమ్‌ను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు.  

అందుబాటు ధర కీలకం: మారుతీ సీఈఓ 
నియంత్రణలు, అందుబాటు ధరల మధ్య సరైన సమతుల్యత కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేచి పేర్కొన్నారు. దీనివల్ల భారతీయ కొనుగోలుదారులకుసురక్షితమైన, పర్యావరణహిత రవాణా అందుబాటులో ఉంటుందన్నారు. దేశంలో పశువుల పేడ, బయోమాస్, వ్యవసాయ వ్యర్థాలు పుష్కలంగా లభ్యమవుతున్నందున, కంప్రె‹స్డ్‌ బయోగ్యాస్‌కు భారీ అవకాశాలున్నాయని, దీన్ని స్వచ్ఛమైన వాహన ఇంధనంగా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నియంత్రణపరమైన వ్యయాలు పెరిగిపోవడంతో తొలిసారి కారు కొనుగోలు చేసేవారికి భారంగా మారింది. 

దీంతో గత కొన్నేళ్లుగా చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు పడిపోయాయి. లక్షలాది భారతీయ కుటుంబాలకు కారు కొనుగోలు ఇప్పటికీ పెద్ద కల. మరింత రక్షణతో పాటు సౌలభ్యం, సౌకర్యాన్ని కల్పిస్తుంది. అందుకే అందుబాటు ధర చాలా ముఖ్యం’ అని టకేచి పేర్కొన్నారు. ఇటీవలి జీఎస్‌టీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెల్లలోనే చిన్న కార్ల (18 శాతం లోపు జీఎస్‌టీ శ్లాబ్‌లో ఉన్నవి) అమ్మకాలు ఏకంగా 30 శాతం మేర ఎగబాకడాన్ని ఆయన ఉదహరించారు. మరీ ముఖ్యంగా ఎంట్రీ లెవెల్‌ కార్లలో ఏకంగా 100 శాతం వృద్ధి నమోదైందని, అందుబాటు ధరకున్న మహిమకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement