న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చేందుకు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ సిద్ధం చేసిన వినూత్న కానుక.. భారత్‌కు చేరకముందే కరిగిపోయింది. అత్యుత్తమ బెల్జియన్ చాక్లెట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన ఢిల్లీ ఇండియా గేట్ ప్రతిబింబించే చాక్లెట్‌ను గిఫ్ట్‌గా ఇద్దామనుకున్నట్లు బార్ట్ వెల్లడించారు. అయితే, భారత్‌కు దాన్ని తీసుకురాలేకపోయానని తెలిపారు. బహుమతి.. ప్రయాణంలో కరిగిపోవడంతో భారత్‌కు చేరుకోలేకపోయింది. అయితే, మరో ప్రతిరూపాన్ని బెల్జియంలో సిద్ధంగా ఉంచామని.. దాన్ని ఈసారి మోదీకి ‘ఒక్క ముక్కలో’ అందజేస్తానంటూ డి వెవర్ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.
"మా ఉమ్మడి చరిత్ర, భవిష్యత్ భాగస్వామ్యానికి ప్రతీకగా మేము ఇండియా గేట్‌ను ఎంచుకున్నాము. ఎందుకంటే ఇండియా గేట్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్లాండర్స్ ఫీల్డ్స్‌లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికులను స్మరించే శాసనంపై ఉన్న భాగాన్ని ఈ చాక్లెట్ శిల్పంపై పెద్దదిగా రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఒక శతాబ్దానికి పైగా భారతీయ సైనికులు వేల మైళ్ళు ప్రయాణించి బెల్జియం గడ్డపై పోరాడారు. వారి త్యాగాన్ని మేము మరిచిపోలేదు. వారి ధైర్యాన్ని, త్యాగాన్ని మేం ఎప్పటికీ మరువలేమన్నారు.
బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2027 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఫిన్‌టెక్, క్రిటికల్ మినరల్స్, ప్రజల మధ్య సంబంధాలు, విద్యా-పరిశోధనా సహకారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మోదీ, వెవర్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.
ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం - బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు జరిపారు. భారత్-బెల్జియం ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రజల మధ్య సంబంధాలే అత్యంత కీలకమైన బలంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.


