ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేనివారి దాదాపు ఉండరు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మన రోజువారి జీవితంలో మొబైల్ నంబర్ చాలా ముఖ్యమైనది. ఎవరి ఫోన్ నెంబర్ అడిగినా వెంటనే 10 అంకెలే చెబుతారు. అయితే.. మన మొబైల్ నంబరులో 10 అంకెలే ఎందుకు ఉన్నాయి?, అందులో కూడా ఎక్కువగా 9, 8, 7, 6తోనే ఎందుకు మొదలవుతాయి? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
10 అంకెలే ఎందుకు?
భారత్‌లో టెలికాం నెంబర్ల కేటాయింపును డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నెంబర్లను సరిగ్గా కేటాయించేందుకు నేషనల్ నంబరింగ్ ప్లాన్ (NNP) ఉంది. 2003లో రూపొందించిన ఈ ప్లాన్‌లో మొబైల్ సేవలకు 10 అంకెల నంబరింగ్ విధానాన్ని కొనసాగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. దేశంలో మొబైల్ వాడకం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని ముందే అంచనా వేసి, ఎక్కువ మందికి ప్రత్యేకమైన నంబర్లను ఇవ్వడానికి 10 అంకెల విధానాన్ని ఉపయోగించారు.
9, 8, 7, 6తోనే ఎందుకు..
మొదట్లో మొబైల్ నంబర్ల కోసం 9 సిరీస్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమేణా మొబైల్ కనెక్షన్లు భారీగా పెరగడంతో 9 సిరీస్‌లో అందుబాటులో ఉన్న నంబర్లు తగ్గిపోయాయి. దీంతో కొత్త నంబర్ల కోసం 8, ఆ తర్వాత 7, 6 సిరీస్‌లను కూడా మొబైల్ సేవలకు కేటాయించారు. ఇక 0, 1 వంటి అంకెలను ప్రత్యేక సేవలు, షార్ట్ కోడ్లు, ఇతర టెలికాం అవసరాలకు ఉపయోగిస్తారు. అందుకే మనం సాధారణంగా 6, 7, 8, 9తో మొదలయ్యే మొబైల్ నంబర్లను ఎక్కువగా చూస్తుంటాం.
10 అంకెలతో ఎన్ని నంబర్లు వస్తాయి?
10 అంకెలు ఉన్నాయంటే భారీ సంఖ్యలో నంబర్ల కలయికలను తయారు చేయవచ్చు. అయితే.. అందులో ప్రతి కలయికను మొబైల్ నంబర్‌గా ఉపయోగించరు. కొన్ని నంబరింగ్ సిరీస్‌లను ఫిక్స్‌డ్ లైన్లు, ప్రభుత్వ సేవలు, ప్రత్యేక సేవలు, ఇతర టెలికాం అవసరాల కోసం కేటాయిస్తారు. మొదట్లో 9 సిరీస్‌ను మాత్రమే మొబైల్ సేవలకు ఉపయోగించినప్పటికీ.. వినియోగదారులు పెరిగేకొద్దీ 8, 7, 6 సిరీస్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
భవిష్యత్తులో నంబర్ మారుతుందా?
భారతదేశంలో మొబైల్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నంబరింగ్ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ కూడా నంబరింగ్ ప్లాన్‌లో మార్పులపై సిఫారసులు చేసింది. అయితే.. ప్రస్తుతం ఉన్న మొబైల్ నుంచి మొబైల్ కాలింగ్ విధానాన్ని కొనసాగించాలని సిఫారసు చేశారు. అంటే.. ప్రస్తుతానికి మన 10 అంకెల మొబైల్ నంబర్ విధానం మారే అవకాశం లేదు. కాగా.. మొబైల్ నంబర్ ముందు కనిపించే +91 అనేది మన దేశ కంట్రీ కోడ్. విదేశాల నుంచి భారత్‌లోని నంబర్‌కు కాల్ చేసినప్పుడు +91 తర్వాత మన 10 అంకెల మొబైల్ నంబర్‌ను డయల్ చేస్తారు.


