పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన ద్వారా డబ్బులు పొందుతున్న రైతులకు 24వ విడతకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేయబోతోందని, ఇప్పటికే డబ్బులు పంపడం మొదలుపెట్టిందని కొన్ని పోస్టుల్లో చెబుతున్నారు. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూ.4,000 విడత వార్తను పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ ఖాతా కూడా ఖండించింది. 24వ విడతగా రూ.4,000 పంపుతున్నట్లు వచ్చిన వీడియోలు, పోస్టులు నకిలీవని స్పష్టం చేసింది. కాబట్టి.. ఇలాంటి సోషల్ మీడియా పోస్టులను చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా.. తెలియని లింకులపై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదు.
24వ విడత ఎప్పుడు వస్తుంది?
పీఎం కిసాన్ పథకం 23వ విడతను జూన్ 20న విడుదల చేశారు. దీంతో 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 24వ విడతకు సంబంధించి అధికారిక తేదీని ప్రకటించలేదు. కాబట్టి.. అక్టోబర్‌లోనే డబ్బులు వస్తాయని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది.
రైతులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి
తదుపరి విడత డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావాలంటే రైతులు కొన్ని విషయాలను ముందుగానే చెక్ చేసుకోవాలి.
➤e-KYC పూర్తి చేసుకోవాలి.
➤బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయిందో లేదో చూసుకోవాలి.
➤ఫార్మర్ ఐడీ లేకపోతే వెంటనే క్రియేట్ చేసుకోవాలి.
➤ఇంకా భూమి ధృవీకరణ చేయించుకోనట్లయితే, 24వ విడత రాకముందే దానిని చేయించుకోండి.
వీటిలో ఏదైనా పెండింగ్‌లో ఉంటే పీఎం కిసాన్ డబ్బులు రావడంలో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.
#FakeNewsAlert
A post claiming that 24th instalment of PM-KISAN is ₹4,000 is going viral on social media.
This claim is fake. No such official announcement has been made.
Stay Alert!
Verify any news related to govt schemes from official government sources . #PMKISAN #FakeNews pic.twitter.com/ksXz3TdGUl— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) August 20, 2026


