సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.
బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్‌లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు.
రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్‌బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని ఆరోపించారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.


