సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు..
..ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్‌లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.
ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయం



