కొండా సురేఖపై వేటా? రాజీనామా చేయిస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్‌ పాలిటిక్స్‌ | Minister Konda Surekha Issue Highlight In Delhi Congress | Sakshi
Sakshi News home page

కొండా సురేఖపై వేటా? రాజీనామా చేయిస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్‌ పాలిటిక్స్‌

Aug 26 2026 8:57 AM | Updated on Aug 26 2026 9:04 AM

Minister Konda Surekha Issue Highlight In Delhi Congress

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేతల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడంతో.. ఏఐసీసీ పెద్దలు తదుపరి నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై అధిష్టానంలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే, కొండా సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదురవుతాయన్న అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆమె బీసీ మహిళా మంత్రి కావడంతో నేరుగా వేటు వేస్తే పార్టీపై వచ్చే రాజకీయ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సస్పెన్షన్‌కు బదులుగా రాజీనామా చేయించడం ద్వారా మధ్యేమార్గాన్ని అనుసరించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో అధిష్టానం నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారుల ఎంపిక కోసం 28న లక్కీ డ్రా.. 

ఇక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీపై ఈ వ్యవహారం చూపుతున్న ప్రభావం, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖపై ఎలాంటి చర్య ఉంటుందన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సస్పెన్షన్‌ చేస్తారా? లేక మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

చిన్నారెడ్డి పరిస్థితేంటి?
మరోవైపు సీనియర్‌ నేత చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనను అధికార పదవి నుంచి తప్పిస్తారా? లేక కేవలం మందలింపుతో వ్యవహారాన్ని ముగిస్తారా? అనే అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిపై ఒకే తరహా చర్య తీసుకోవాలా? లేక వారి వ్యవహారాలను వేర్వేరుగా పరిగణించాలా? అన్నదానిపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ రియాక్షన్‌పై పలువురు నేతలు ఎదురుచూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. కాగా, మంత్రి సురేఖ మాత్రం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement