ఏఐ వైపు విద్యా సంస్థలు | Educational institutions towards AI | Sakshi
Sakshi News home page

ఏఐ వైపు విద్యా సంస్థలు

Aug 26 2026 5:49 AM | Updated on Aug 26 2026 5:49 AM

Educational institutions towards AI

80 శాతం కాలేజీలు సన్నద్ధం 

పాలనపరమైన అవసరాలకే ప్రాధాన్యం.. విద్యార్థుల అభ్యసనపై అధ్యాపకుల అనుమానాలు 

స్వతంత్ర ఆలోచనలకు ప్రమాదం అనే వాదన.. క్యూఎస్‌ వన్‌ గేజ్‌ అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావం రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెరగబోతోంది. ఇప్పటికే 80 శాతం విద్యాసంస్థలు ఏఐ ఆధారిత పాలన విధానాలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో బోధన విధానాల్లోనూ ఏఐ తోడ్పాటును అనివార్యంగా స్వాగతించాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. 2035 నాటికి ఏఐ వినియోగం మూడు రెట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. అయితే, ఏఐని ప్రవేశపెట్టడంతోనే సరిపోదు. దానిపై పూర్తి స్థాయి అవగాహన అధ్యాపక వర్గానికి అందినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. 

క్యూఎస్‌–1 గేజ్‌ (క్వాక్వారెల్లి సైమండ్స్‌ ఇండియన్‌ గేజ్‌) తాజా అధ్యయనంలో ఈమేరకు వెల్లడైంది. క్యూఎస్‌–1 గేజ్‌ యూకే ఆధారిత గ్లోబల్‌ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ. ఇది ప్రపంచ యూనివర్సిటీల ప్రమాణాలపై అధ్యయనం చేసి, ర్యాంకింగ్‌ ఇస్తుంటుంది. కొన్ని నెలలుగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 146 ఉన్నత విద్యా సంస్థల నుంచి ’భారత ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ అనుసంధానం’అనే అంశంపై అధ్యాపకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది.  

పాలనలో మెరుగు 
ఏఐని విద్యాసంస్థల్లో పాలన అవసరాల కోసం ఉపయోగించేందుకు 80 శాతం సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల పాలన మరింత సమర్థవంతంగా ఉంటుందని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. రొటీన్‌ పనులు, సమాచార నిర్వహణ, కంటెంట్‌ తయారీకి ఏఐ బాగా ఉపయోగపడుతోందని చెప్పారు. అయితే, విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, అధ్యాపకులకు శిక్షణ, స్పష్టమైన నైతిక మార్గదర్శకాలు, బలమైన డిజిటల్‌ మౌలిక వసతులు, సంస్థాగత మద్దతు ఇవ్వాలని మెజారిటీ అధ్యాపకులు తెలిపారు. 

ప్రతిభకు స్పీడ్‌ బ్రేకర్‌ 
ఏఐ వినియోగం వల్ల విద్యార్థుల ప్రతిభ మసకబారుతుందని 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ సాధనాలు విద్యార్థుల వ్యక్తిగత అభ్యసన అవసరాలను సమర్థంగా తీర్చలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మానవీయ అవగాహన, సానుభూతి, సందర్భానుసారమైన మార్గదర్శకత్వంలో ఏఐకి ఇంకా పరిమితులు ఉన్నాయని తెలిపారు. ఏఐపై అతిగా ఆధారపడితే విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు తగ్గే అవకాశం ఉందని 78 శాతం మంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. 

దీంతో ఏఐని పూర్తిగా ప్రత్యామ్నాయంగా కాకుండా బోధనకు సహాయక సాధనంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నివేదిక ప్రస్తావించింది. విద్యార్థులు ప్రాజెక్టు వర్క్, ఇతర అసైన్‌మెంట్ల విషయంలో అధ్యాపకులు పూర్తిగా విశ్వసించలేకపోవడమే దీని సారాంశం. ప్రతీ పనికి విద్యార్థులు ఏఐపై ఆధారపడటం వల్ల వారి సృజనాత్మకత దెబ్బతింటోందని, సొంతంగా ఆలోచించే విధానం తగ్గుతోందని 72 శాతం మంది అధ్యాపకులు అన్నారు.  

ఇంకెన్నో అనుమానాలు 
ఏఐని మూల్యాంకన దశకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఏఐ రూపొందించిన సమాధానాల కచ్చి తత్వాన్ని ధ్రువీకరించడం సవాల్‌గానే మారిందని 68% మంది అధ్యాపకులు అన్నారు. ఏఐ సమాచారాన్ని యథాతథంగా నమ్మకుండా వాస్తవ నిర్థారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డేటా గోప్యత, డేటా షేరింగ్‌ పరిమితులను అర్థం చేసుకోవడం కూడా మరో ప్రధాన సమస్యగా ఉందని 53% మంది అధ్యాపకులు పేర్కొన్నారు. 

ఏఐని సమర్థంగా అమలు చేయడానికి సంస్థలు అందించాల్సిన సహాయాల్లో ప్రత్యక్ష శిక్షణా వర్క్‌షాప్‌లు ఉండాలని 71 మంది అధ్యాపకులు సూచించారు. 61 శాతం మంది ప్రీమియం లేదా ఎంటర్‌ప్రైజ్‌ స్థాయి ఏఐ సాధనాలకు సంస్థాగత గోప్యత అవసరమని తెలిపారు. 40 శాతం మంది అధ్యాపకులు ఏఐ సాధనాలను సమర్థంగా నేర్చుకోవడానికి ముందస్తు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని భావిస్తున్నారు. దీంతో కేవలం సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంచడం కాకుండా, దాన్ని బోధనలో ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రాక్టికల్‌ శిక్షణ అవసరమని చెప్పారు.  

ఏఐ అనివార్యమే
ఏఐ ఆధారిత ప్రోగ్రామ్‌ విద్యాసంస్థలకు అనివార్యం. పాలనపరమైన అంశాల్లో డేటా బేస్డ్‌ ప్రోగ్రాంకు వెళ్తున్నాం. ఇది ఉపయుక్తంగా ఉంటోంది. పాఠ్యాంశాల రూపకల్పన, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా సాంకేతికతపై మరికొంత క్లారిటీ కావాలి. – వినీత్‌ జాన్‌ రాబర్ట్‌ (హైదరాబాద్‌లో ఉన్నత విద్యాసంస్థ నిర్వాహకుడు) 

విద్యార్థుల కోణంలో ఆలోచించాలి
ప్రాజెక్టు వర్క్‌లను ఏఐ ఆధారంగా పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో ఆలోచన శక్తి తగ్గుతోంది. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయగలిగినా వాస్తవ జిజ్ఞాస కొరవడటం పెద్ద లోపం. ఉద్యోగాల్లో నిత్యం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తేనే భవిష్యత్‌. పునాది దశలో ఈ లోపాన్ని సరిచేయాలి. ఏఐకి విద్యార్థులు టూల్‌గా మారితే ప్రమాదమే.  – సంధ్యారాణి  (వరంగల్‌ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలు)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement