భూసేకరణ, అటవీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత రానివ్వం
గోదావరి జలాలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు
సమీక్షలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.38 టీఎంసీల గోదావరి జలాలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇకపై జాప్యానికి తావులేకుండా సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రాజెక్టును ఫాస్ట్‌ట్రాక్‌పై పెట్టి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి మంగళవారం జలసౌధలో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏ పని ఎక్కడ నిలిచిపోయింది? దానికి కారణమేంటి? పరిష్కారానికి ఏం చేయాలి? అనే అంశాలపై లోతుగా చర్చించామన్నారు.
భూసేకరణ, అటవీ అనుమతులు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపులో ఒక్కరోజూ జాప్యం ఉండకూడదన్నది ప్రభుత్వ విధానమని, సాధ్యమైనంత అధికంగా గోదావరి జలాలను ఎత్తిపోయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టుతో ఏళ్లుగా అనుబంధం ఉన్న సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీనియర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొనడంతో క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించే అవకాశం లభించిందని తెలిపారు.
సీఎంకు నివేదించాలి..: పొంగులేటి
దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన ఉన్న అధికారులతో మొదటి నుంచి చివరివరకు సమగ్ర సమీక్ష నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రామప్ప చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 29 నుంచి 35 అడుగులకు పెంచేందుకు అంచనాలను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఒక్కో అడుగు నిల్వ పెంచితే ఎంత భూమి అవసరమవుతుందో సమగ్ర నివేదిక అందించాలని కోరారు.
రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులను రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జంపన్నవాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఈ లింక్ కెనాల్ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. త్వరలో జరగనున్న జాతరను దృష్టిలో ఉంచుకుని రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులతో పాటు సంబంధిత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.


