లక్ష కోట్లకు చేరువగా..! | State governments treasury has reached Rs 1 lakh crore this financial year | Sakshi
Sakshi News home page

లక్ష కోట్లకు చేరువగా..!

Aug 26 2026 5:34 AM | Updated on Aug 26 2026 5:34 AM

State governments treasury has reached Rs 1 lakh crore this financial year

ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు మాసాల్లో రూ.93వేల కోట్ల రాబడులు... గతేడాదితో పోలిస్తే 19వేల కోట్ల ఎక్కువ నిధులు ప్రభుత్వ ఖజానాకు 

జీఎస్టీ, స్టాంపుల ఆదాయంలో పురోగతి... రెండు పద్దులూ కలిపి రూ.25వేల కోట్లకు పైమాటే 

అప్పుల రూపంలో రూ.33వేల కోట్లుసమీకరించుకున్న ప్రభుత్వం 

నాలుగు నెలల కాలంలో కేంద్రం నుంచి వచ్చింది రూ. 7,800 కోట్లు మాత్రమే 

రూ.30 వేల కోట్ల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకే ఖర్చు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రూ.లక్ష కోట్లకు చేరువైంది. గత నాలుగు నెలల కాలంలో అన్ని రకాల రాబడుల రూపంలో రూ. 93,388 కోట్లు సమకూరాయి. అంటే ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.3.24 లక్షల కోట్లలో దాదాపు 30 శాతం మేర సమకూరాయన్నమాట. అదే గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.19వేల కోట్ల కంటే ఎక్కువ ఖజానాకు సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో పురోగతితోపాటు రుణాలు కూడా ఓ మేరకు ఎక్కువగా తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడులు ఆశాజనకంగానే ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక చెబుతోంది.  

పన్ను రాబడులు మెరుగ్గానే.. 
సొంత పన్నుల ఆదాయం ఏటేటా పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే ధోరణి కనిపిస్తోంది. జీఎస్టీ రూపంలో రూ.19,103 కోట్లు, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,144 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 12,584 కోట్లు, ఇతర పన్నుల రూపంలో రూ. 2,703 కోట్లు, పన్నేతర ఆదాయం కింద రూ. 4,274 కోట్లు సమకూరాయి. వీటికి తోడు బహిరంగ మార్కెట్‌లో రుణాల రూపంలో రూ. 33,729 కోట్లు ఖజానాకు చేరాయి.  

జీతాలకే ఎక్కువ ఖర్చు 
రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు పద్దులను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే ఎక్కువగా ఖర్చయింది. రెవెన్యూ పద్దు కింద రూ.32వేల కోట్లకు పైగా ఖర్చు కాగా, ఉద్యోగుల వేతనాల కోసం రూ. 17,874 కోట్లు, పింఛన్ల రూపంలో రూ. 10,492 కోట్లు వ్యయమైంది. ఇక, గతంలో చేసిన అప్పులకు వడ్డీల కింద రూ. 10,532 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు వివిధ రకాల సబ్సిడీల కోసం రూ. 7,870 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో అన్ని పద్దుల కింద రూ. 93వేల కోట్లు రాగా, రూ. 88,182 కోట్లు ఖర్చు కావడం గమనార్హం.  

కేంద్రం నుంచి వచ్చింది తక్కువే.. 
ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి సాయం తక్కువగానే వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 4నెలల కాలంలో రూ. 5,502 కోట్లు వచ్చాయి. దీంతోపాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో మరో రూ.2,300 కోట్లు వచ్చాయి. అదే గత ఏడాది ఇంతకంటే ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలకు రూ. 5,899 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా కింద, రూ.700 కోట్లకుపైగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో సమకూరాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement