తాము ఇప్పటికే నివేదిక అందజేశామన్న సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎస్‌ఏ
ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
ఒత్తిడి తగ్గించేందుకు మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచాలని సూచించాం
ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత,ఆపరేషన్, నిర్వహణలో లోపాలు
తదుపరి విచారణ రెండు వారాల్లో చేపట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇబ్బందులు విధానపరమైన అంశాలని, సాగునీటిని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల భద్రత, పునరుద్ధరణ, నీటి నిర్వహణపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) ఇప్పటికే పలుమార్లు సాంకేతిక పరిశీలనలు నిర్వహించి, నిపుణుల కమిటీల సిఫారసుల మేరకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హైకోర్టుకు తెలిపింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు దానిని ఆపరేట్ చేయరాదని, నిర్మాణంపై నీటిఒత్తిడి తగ్గించేందుకు గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని నిపుణుల కమిటీ సూచించినట్టు వెల్లడించింది. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును సురక్షితంగా వినియోగించే అంశంపై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ న్యాయవాది ఎస్.శరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల రక్షణ, వినియోగ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్‌డీఎస్‌ఏతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. బరాజ్‌లతోపాటు కన్నెపల్లి సుందిళ్ల పంప్‌హౌస్‌ల స్వతంత్ర సాంకేతిక తనిఖీ చేపట్టాలని, ఆ ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించేందుకు పంప్‌హౌస్‌లలో దేనినైనా పాక్షికంగా వినియోగించే సాధ్యతపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. బరాజ్‌ల భద్రతపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
కౌంటర్‌లో సీడబ్యూసీ పేర్కొన్న వివరాలు..
‘మేడిగడ్డ బరాజ్ పియర్లు కుంగిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) 2023, అక్టోబర్ 22న ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ 23–25 మధ్య బరాజ్‌ను పరిశీలించి, నవంబర్ 1న నివేదిక సమర్పించింది. ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణలో లోపాలతోనే నష్టం జరిగిందని పేర్కొంది. మేడిగడ్డను వినియోగంలోకి తేవడానికి ముందు పునరుద్ధరణ అవసరమని, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కూడా అత్యవసరంగా పరిశీలించాలని సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 2024, మార్చి 2న మరో కమిటీని ఏర్పాటు చేశాం. సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్, ఐఐటీ ఢిల్లీ సభ్యులతో కూడిన ఈ కమిటీ మూడు బరాజ్‌లపై సమగ్ర అధ్యయనం చేసింది. 2025 మార్చిలో తుది నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్లాక్–7 గేట్లను వరద కాలానికి ముందు పూర్తిగా తెరిచి ఉంచాలని, అత్యధికంగా దెబ్బతిన్న పియర్ నంబర్ 20కు సమీపంలోని గేట్ నంబర్లు 20, 21లను అవసరమైతే పూర్తిగా తొలగించాలని కూడా సూచించింది. మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా తెరిచి, ఆ స్థితిలోనే పటిష్టంగా బిగించాలని పేర్కొంది.
ఏదైనా గేటును పూర్తిగా ఎత్తడంలో ఇబ్బంది ఎదురైతే దానిని కూడా పూర్తిగా తొలగించాలని సిఫారసు చేసినట్టు వివరించింది. పియర్ నంబర్ 20కి ఆనుకుని ఉన్న గేట్లను పూర్తిగా తొలగించాలని కమిటీ మధ్యంతర సిఫారసులు చేసింది. ఈ మార్చి 27న హైదరాబాద్‌లో ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అధ్యక్షతన బరాజ్‌ల ఆరోగ్య స్థితిపై సమీక్షా సమావేశం జరిగింది. కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు 2026, జూన్ 30న సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశాం. డ్యామ్ సేఫ్టీ చట్టం, 2021 కింద ఎన్‌డీఎస్‌ఏ.. తన చట్టబద్ధ విధులను నిర్వర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టినప్పుడు వాటిని కమిటీ పర్యవేక్షిస్తుంది. నిర్దిష్ట బరాజ్‌కు భద్రత, మరమ్మతు చర్యలపై సూచనలిచ్చే బాధ్యత స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎస్‌వో)దేనని తెలిపింది. తాము చట్టబద్ధ విధులను నిర్వర్తించలేదని, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు పొందడంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని పిటిషనర్ చేసిన ఆరోపణలు సరికాదు. వ్యవసాయపరమైన ఇబ్బందులు విధానపరమైనవని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. పిటిషనర్ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగలేదు. పిటిషన్‌ను కొట్టివేయాలి’అని కోరింది.


