మళ్లీ తెరపైకి గోదావరి నీటి లభ్యత | Godavari water availability back on the agenda | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి గోదావరి నీటి లభ్యత

Jun 3 2026 4:10 AM | Updated on Jun 3 2026 4:10 AM

Godavari water availability back on the agenda

ఏపీ, తెలంగాణతో సీడబ్ల్యూసీ సీఈ భేటీలో స్వతంత్ర సంస్థతో అధ్యయనానికి సూత్రప్రాయ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నది పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యతపై మళ్లీ స్వతంత్ర సంస్థతో అధ్య యనం జరపాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. గోదావరి బేసిన్‌లో నీటి లభ్యతపై మంగళవారం సీడబ్ల్యూసీ లోని హైడ్రలాజికల్‌ స్టడీస్‌ ఆర్గనైజేషన్‌ విభాగం సీఈ సంజయ్‌కుమార్‌ గంగ్వార్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో వర్చువ ల్‌గా సమావేశం నిర్వహించారు. 2023లో సీడబ్ల్యూ సీ ఇచ్చిన నివేదికలో నిర్ధారించిన నీటి లభ్యత లెక్కలను ఈ సమావేశంలో ఏపీ అధికారులు కొట్టిపారేశారు. 

సీడబ్ల్యూసీ నివేదికను ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పరిధిలోని గోదావరి బేసిన్‌లో 1,486 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంటుండగా, 2004లో వ్యాప్కోస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 1,360 టీఎంసీలేనని ఏపీ వాదిస్తోంది. సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్‌ నివేదికల్లో వైరుధ్యాలున్న నేపథ్యంలో గోదావరి బోర్డు నేతృత్వంలో ఒక స్వతంత్ర సంస్థతో మళ్లీ అధ్యయనం జరపాలని తాజా సమావేశంలో ఏపీ చేసిన విజ్ఞప్తి పట్ల సీఈ సంజయ్‌కుమార్‌ గంగ్వార్‌ సానుకూలంగా స్పందించారు. ఆయన చేయనున్న సిఫారసుల ఆధారంగా త్వరలో సీడబ్ల్యూసీ ఓ నిర్ణయం తీసుకోనుంది. 

గోదావరికి సంబంధించిన 8 ఉప నదులు తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తున్నాయి. మంజీరా, మధ్య గోదావరి, మానేరు, పెన్‌గంగా, వార్ధా, వెన్‌గంగా/ప్రాణహిత, దిగువ గోదావరి, ఇంద్రావతి సబ్‌ బేసిన్లు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. శబరి గతంలో తెలంగాణ పరిధిలోనే ఉండడంతో పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో ఆ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయింది. ఈ ఉప నదుల పరిధిలో సాగుకు వాడుకుంటున్న నీళ్లలో 10 శాతం, తాగు అవసరాలకు వాడుకుంటున్న నీళ్లలో 97.5శాతం, పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్న నీళ్లలో 80శాతం తిరిగి గోదావరిలోనే కలుస్తున్నాయి. 

1980లో బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. ఈ నీటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో వ్యాప్కోస్‌ ఇచ్చిన నివేదికలో తప్పులు దొర్లాయని పేర్కొంటోంది. ఈ నీటిని సైతం పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి ఏపీకి 1,500 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సీడబ్ల్యూసీ మళ్లీ అధ్యయనం జరపాలని నిర్ణయిస్తే వాస్తవ నీటి లభ్యత లెక్కలపై స్పష్టత రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement