NDSA
-
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారాయన. తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్ఎస్వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్, రీ డిజైనింగ్ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్ఎస్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది. NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్‌లను ఎన్డీఎస్ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్ పెద్ద మిస్టేక్. అది కూలినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాల్స్, భీమ్స్‌లో రంధ్రాలు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. రీడిజైన్ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం.