రాజకీయ ప్రేరేపిత చర్య | BRS MLA Harish Rao fires on Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రేరేపిత చర్య

Published Wed, Apr 30 2025 4:57 AM | Last Updated on Wed, Apr 30 2025 4:57 AM

BRS MLA Harish Rao fires on Uttam Kumar Reddy

ఆ నివేదికను అడ్డుపెట్టుకుని ఉత్తమ్‌ రాజకీయం చేస్తున్నారు 

మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజం 

ఎన్డీఎస్‌ఏ బిల్లును గతంలోఉత్తమ్‌ వ్యతిరేకించారు.. 

‘మేడిగడ్డ’లో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా బురద చల్లేందుకు యత్నం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్‌డీఎస్‌ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్‌డీఎస్‌ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. 

కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్‌ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్‌ఏ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్‌ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్‌ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 

భారత్‌ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక పేరిట బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్‌ గర్జనతో కాంగ్రెస్‌ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘ఎన్డీఎస్‌ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది 
‘బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్‌ కనీసం ఎన్డీఎస్‌ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్‌ అపసోపాలు పడ్డారు. బ్లాక్‌ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.  

లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? 
మహారాష్ట్రతో అంతర్‌ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్‌ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్‌ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. 

నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్‌ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement