సాగర్‌కు ఓనర్‌ తెలంగాణే | The owner of the Nagarjunasagar project is the Telangana state says Anil Jain | Sakshi
Sakshi News home page

సాగర్‌కు ఓనర్‌ తెలంగాణే

May 1 2025 3:52 AM | Updated on May 1 2025 3:52 AM

The owner of the Nagarjunasagar project is the Telangana state says Anil Jain

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌జైన్‌ స్పష్టీకరణ

వాలంతరిలో ఆయనతో ఈఎన్సీ నేతృత్వంలో అధికారుల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఓనర్‌ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) చైర్మన్‌ అనిల్‌జైన్‌ స్పష్టం చేశారు. ఎన్డీఎస్‌ఏకు సంబంధించిన ‘డ్యామ్‌ హెల్త్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ మానిటరింగ్‌ అప్లికేషన్‌’ వెబ్‌సైట్‌ (http://dharma.cwc.gov.in)లో డ్యా­మ్‌ ఓనర్‌గా ఎవరి పేరుతో ఉంటే.. వారే ఓనర్‌గా ఉంటారని తెలిపారు. దీని ప్రకారం సాగర్‌ ఓనర్‌ తెలంగాణ రాష్ట్రమేనని తేల్చి చెప్పారు. 

ఏపీ పర్య­టన ముగించుకొని తెలంగాణ పర్యటనకు వచ్చిన అనిల్‌జైన్‌తో బుధవారం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల బృందం వాలంతరిలో సమావేశమైంది. రాష్ట్రంలో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం అమలు తీరును అనిల్‌జైన్‌ అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి డ్యామ్‌కు సంబంధించిన డ్యామ్‌ బ్రేక్‌ అనాలసిస్‌ తయారు చేస్తున్నామని ఈఎన్సీ అనిల్‌కుమార్‌ తెలియజేశారు. వర్షాలకు ముందు, తర్వాత డ్యామ్‌లకు తనిఖీలు నిర్వహించి నివేది­క­లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 

ప్రతి డ్యా­మ్, బరాజ్‌కు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) నియమావళి (మాన్యువల్‌)ని సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అనిల్‌జైన్‌ సూచించారు. నాగార్జున­సాగర్‌ డ్యామ్‌కు మరమ్మతులు చేయకపోతే డ్యా­మ్‌ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ విభజన తర్వాత నాగార్జున­సాగర్‌ నిర్వహణ తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి వెళ్లిందని అనిల్‌కుమార్‌ జైన్‌కు వివరించారు. 

2023 నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం పోలీసు బలగాలతో బలవంతంగా నాగార్జున­సాగర్‌ కుడివైపు భాగాన్ని తన అధీనంలోకి తీసు­కుందని తెలిపారు. దీంతో డ్యామ్‌కు మరమ్మతుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నా­య­న్నా­రు. చట్ట ప్రకారం సాగర్‌ డ్యామ్‌ ఓనర్‌ తెలంగాణ రాష్ట్రమేనని ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ బదులిచ్చారు.

కాళేశ్వరం బరాజ్‌లపై దిశానిర్దేశం చేయాలి 
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుం­దిళ్ల బరాజ్‌ల తాత్కాలిక, శాశ్వత పున­రుద్ధరణ చర్యలకు ఎన్డీఎస్‌ఏ తుది నివేదికలో ఎలాంటి సిఫారసులు చేయలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్‌ అన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వస్తే నిపుణుల కమిటీని పిలిపించి తగిన సిఫారసులు చేయిస్తామని అనిల్‌జైన్‌ బదులిచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) టి.శ్రీనివాస్, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి, కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు 
శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, దిగువన ప్రమాదకర స్థాయిలో ప్లంజ్‌ పూల్‌ విస్తరించింద­ని, వర్షాలు ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాలని ఈఎన్సీ అనిల్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని అనిల్‌జైన్‌ బదులిచ్చారు. నాగార్జునసాగర్‌ స్పిల్‌వేకు శాశ్వత మరమ్మతుల కోసం టవర్‌ క్రేన్‌ ఏర్పాటు చేశామని అనిల్‌కుమార్‌ చెప్పారు. సాగర్‌ కట్టపై ఏపీ ఆక్రమణను తొలగించి, మరమ్మతులకు సహకరించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement