భీమాపై నిర్మిస్తున్న బ్యారేజ్, ఎత్తిపోతలపై నోరుమెదపని చంద్రబాబు
సీడబ్ల్యూసీ ఏకపక్షంగా అనుమతిచ్చినా చంద్రబాబు సర్కారు మౌనం
ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు, తుంగభద్ర, అప్పర్ భద్రలపైనా అడ్డుచెప్పని వైనం
రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి చేష్టలుడిగి చోద్యం చూస్తున్న చంద్రబాబు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు, సాగునీటి రంగ నిపుణులు
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌భద్రతో జల దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక.. ఇప్పుడు కృష్ణానదికి మరో ప్రధాన ఉపనది భీమాపై కల్బుర్గి జిల్లా సొంతి వద్ద బ్యారేజ్‌తోపాటు ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేస్తోంది. భీమా నదిలో 15 టీఎంసీలకు మించి వినియోగించుకోకూడదని కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) నిర్దేశించినా అంతకంటే ఎక్కువ నీటినే ఆ రాష్ట్రం ఇప్పటికే వినియోగించుకుంటోంది. సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల ద్వారా భీమా జలాలను మరింతగా తరలించుకోవడానికి ఇప్పుడు యత్నిస్తోంది. దీనికి సీడబ్ల్యూసీ వంతపాడింది.
సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలకు అనుమతిస్తూ మార్చి 25న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), సాంకేతిక సలహా మండలి(టీఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను హరిస్తూ కర్ణాటక చేపట్టిన సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు మౌనం దాల్చింది. సీడబ్ల్యూసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ రైతులు మండిపడుతున్నారు. కృష్ణా జలాలపై ఎగువ రాష్ట్రాలకు రాష్ట్ర హక్కులను చంద్రబాబు సర్కారు తాకట్టు పెడుతుందనడానికి సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల మరో తార్కాణం అని సాగునీటిరంగ నిపుణులు, రైతు సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు టీఎంసీల ఎత్తిపోత.. 40 వేల ఎకరాలకు నీళ్లు
కృష్ణా బేసిన్(పరీవాహక ప్రాంతం)లో భీమా సబ్ బేసిన్‌లో 15 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోకుండా కేడబ్ల్యూడీటీ–1 పరిమితిని నిర్దేశించింది. కానీ భీమా జలాలను భారీ ఎత్తున ఇప్పటికే కర్ణాటక సర్కారు మళ్లిస్తోంది. మరింతగా మళ్లించేందుకు 2015లో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టింది.
ఆ రాష్ట్రంలో కల్బుర్గి జిల్లాలో చిట్టాపూర్ తాలుకాలోని తర్వార్‌పేట్ వద్ద భీమాపై బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 4 టీఎంసీలను ఎత్తిపోసి కల్బుర్గి, యాద్గిర్‡ జిల్లాలలో 40 వేల ఎకరాలకు నీళ్లందించేలా సొంతి ఎత్తిపోతలను కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఈ బ్యారేజ్, ఎత్తిపోతలకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించింది.. దీనిపై 2015, మే 25న సీడబ్ల్యూసీ టీఏసీ 125వ సమావేశంలో అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హక్కులను హరించే ఈ నిర్ణయంపై చంద్రబాబు సర్కార్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
అనుమతిచ్చేసిన సీడబ్ల్యూసీ..
అటవీ అనుమతుల్లో జాప్యం వల్ల సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల పనులు గడువులోగా కాంట్రాక్టర్ పూర్తి చేయలేకపోయారు. తాజాగా అటవీ అనుమతులు తెచ్చిన కర్ణాటక సర్కార్.. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.942.39 కోట్లకు సవరిస్తూ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించింది. ఈ ఏడాది మార్చి 25న సీడబ్ల్యూసీ టీఏసీ 160వ సమావేశంలో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలను అజెండాలో చేర్చి, చర్చించింది.. తాజా సమావేశంలోనూ సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసింది.
అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ఈ బ్యారేజీ, ఎత్తిపోతలపై రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఎలా అనుమతిస్తారని సీడబ్ల్యూసీని నిలదీయాల్సిన చంద్రబాబు సర్కార్ తద్భిన్నంగా మౌనవ్రతం పాటిస్తోండటంపై రైతులు మండిపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల పనులు.. ఆయకట్టును చూస్తే భీమా ప్రవాహాన్ని భారీ ఎత్తున మళ్లించే లక్ష్యంతోనే ఈ ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
శ్రీశైలానికి ఎగువ నుంచి ప్రవాహం వచ్చేదెన్నడు?
ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడం ద్వారా మరో 100 టీఎంసీలను డ్యాంలో నిల్వ చేయడంతోపాటు 130 టీఎంసీలను వినియోగించుకునేలా కర్ణాటక సర్కార్ అప్పర్ కృష్ణ ప్రాజెక్టు మూడో దశ పనులను వేగవంతం చేసింది. ఇక తుంగభద్ర సబ్ బేసిన్‌లో తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది.
ఇక 29.9 టీఎంసీలను తరలించేలా అప్పర్ భద్రను చేపట్టిన కర్ణాటక పనులు వేగవంతం చేసింది. ఇప్పుడు భీమాలోనూ అదే తీరు. కృష్ణా ప్రధాన పాయ, ప్రధాన ఉప నదులు తుంగభద్ర, భీమా ప్రవాహాలను కర్ణాటక ఎక్కడికక్కడ కట్టడి చేస్తే శ్రీశైలానికి ఎగువ నుంచి వరద చేరేదెన్నడని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైతే ఎగువ నుంచి నీటి చుక్క కూడా శ్రీశైలానికి చేరే అవకాశం ఉండదు. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టులో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా దొరకవని తేల్చిచెబుతున్నారు.


