ఎనిమిది ప్రధాన రిజర్వాయర్లలో 12.92 శాతమే నీటి నిల్వలు
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్‌లో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రధాన జలాశయాలు అడుగంటుతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, వరద ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జూలై 9 నాటి వివరాలతో విడుదల చేసిన తాజా వారపు బులెటిన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ తెలంగాణ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో కేవలం 12.92 శాతానికి పరిమితమయ్యాయి.
సాగు, తాగునీటి అవసరాలపై ఈ గణాంకాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 1.261 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్ల) నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 30.31 శాతం నిల్వలుండగా, పదేళ్ల సాధారణ సగటు 19.26 శాతంగా నమోదయ్యేది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఏకంగా 33 శాతం మేర నీటి తగ్గుదల రికార్డయింది.
కీలక ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యతను పరిశీలిస్తే నాగార్జునసాగర్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ నిల్వ కేవలం 3.62 శాతానికి పడిపోయింది. సింగూర్‌లో 15.56 శాతం, శ్రీరాంసాగర్‌లో 18.80 శాతం చొప్పున నీరు మాత్రమే అందుబాటులో ఉంది. కడెం ప్రాజెక్టు సాధారణ నిల్వలో కేవలం 21.85 శాతంతో తీవ్ర నీటి లోటును ఎదుర్కొంటోంది. లోయర్ మానేర్‌లో 26.02 శాతం, జూరాలలో 33.33 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది.


