పాలమూరు– రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌: భట్టి | Neglect to complete pending projects during BRS government tenure | Sakshi
Sakshi News home page

పాలమూరు– రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌: భట్టి

Jul 15 2026 3:07 AM | Updated on Jul 15 2026 3:07 AM

Neglect to complete pending projects during BRS government tenure

జూలకల్‌ వద్ద సబ్‌స్టేషన్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే విజయుడు తదితరులు

మల్దకల్‌/ రాజోళి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిచేసి కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించి పలు విద్యుత్‌ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి సొంత జిల్లా అయిన పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి వలసల జిల్లాకు స్వస్తి పలకాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రంలో దొరల పాలనకు స్వస్తి పలికి.. ప్రజాపాలనకు పట్టం కట్టిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు మరెన్నో పథకాలు అందిస్తుందని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందేలా చూడడమే తమ ధ్యేయమన్నారు. శాంతిగనర్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ దగ్గర ఉప ముఖ్యమంత్రికి అలంపూర్‌ ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు
విజయవంతంగా మొదటి మోటార్‌ను నడిపించిన అధికారులు 
కొల్లాపూర్‌: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో మూడేళ్ల తర్వాత మరోసారి నీటి ఎత్తిపోతలు జరిగాయి. 2023 సెప్టెంబర్‌లో మొదటి మోటార్‌ ద్వారా 2 టీఎంసీల మేరకు నీటిని ఎత్తిపోశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ప్రాజెక్టులోని నాలుగు మోటార్లను నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఎల్లూరు లిఫ్టులోని మోటార్లను నడిపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఆదివారం మొదటి పంపు ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించారు. అయితే డ్రై రన్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ఇంజనీరింగ్‌ నిపుణులను పిలిపించి మరమ్మతులు చేపట్టారు. నీటిపారుదల శాఖ ప్రధాన సలహాదారు పెంటారెడ్డి, సీఈ పార్థసారథి, ఎస్‌ఈ రవీందర్‌లు మరమ్మతు పనులను పర్యవేక్షించారు. విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు ఏర్పడడంతో సోమవారం కూడా నీటి పంపింగ్‌ జరగలేదు. 

ఎట్టకేలకు మరమ్మతు పనులన్నీ పూర్తిచేసి మంగళవారం సాయంత్రం 6.20 గంటలకు మొదటి మోటారు ద్వారా జరిగిన పంపింగ్‌ రాత్రి 7.25 గంటలకు వరకు కొనసాగింది. 0.01 టీఎంసీ మేరకు నీటిని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగిందని, ఎల్లూరు లిఫ్టులోని మిగతా మూడు మోటార్లను వారానికి ఒకటి చొప్పున డ్రైరన్, వెట్‌రన్‌ చేపడతామని అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement