‘ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి’ | TG Minister Tummala Nageswara Rao On EL Nino | Sakshi
Sakshi News home page

‘ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి’

Jul 14 2026 10:04 PM | Updated on Jul 14 2026 10:04 PM

TG Minister Tummala Nageswara Rao On EL Nino

హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.  ఈ రోజు నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతోందన్నారు. దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల  శాఖ, భూగర్భ జలాల శాఖ, భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని చెప్పారు.

వర్షపాతం తక్కువగా ఉన్నందున జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. అలాగే శాస్త్రవేత్తలు సూచించిన విధంగా తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే అధిక దిగుబడి పంట రకాలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఐఐఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును పెంచాలని రైతులకు సూచించారు.

భారత వాతావరణ శాఖ(ఐఎండీ)  హైదరాబాద్ సంచాలకురాలు  స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వచ్చే మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని సూచించారు.

భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ జిల్లాల వారీగా భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement