సుప్రీంకోర్టులో హైదరాబాద్ మహిళ కన్నీటిపర్యంతం
ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా పిటిషనర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. 15 ఏళ్లుగా తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోందని, ఒక్కసారి తమ గోడు వినాలని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ... ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను వేడుకున్నారు. అవసరమైతే ఆన్‌లైన్‌లో విచారణకు హాజరుకావాలని, అనవసరంగా ప్రయాణ ఖర్చులు భరించవద్దని సీజేఐ సూచించారు.
తన కేసుకు సంబంధించి స్వయంగా వాదనలు వినిపించేందుకు హైదరాబా ద్ నుంచి వచ్చిన సదరు మహిళ సోమవారం ఉదయం మెన్షన్ సమయంలో మాట్లాడుతూ... ‘పదిహేనేళ్లుగా మేం జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం. మా కుటుంబాలు పూర్తిగా నాశనమయ్యాయి. పిల్లలకు కనీసం తిండిపెట్టలేని, చదువు చెప్పించలేని దీనస్థితిలో ఉన్నాం. నా బాధ మీ మనసుకు చేరాలనే ఇక్కడికి వచ్చాను. ఒక మహిళకు మంగళసూత్రం కంటే మరేదీ ఎక్కువ కాదు.. ఇప్పుడు నా మెడలో ఏముందో చూడండి’ అంటూ తన మంగళసూత్రం తీస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆన్‌లైన్‌లో హాజరుకండి: సహారా ఆస్తుల విక్రయ వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసులో మహిళ ఆవేదనకు స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘మీరు సుప్రీంకోర్టుకు రావడానికి ప్రయాణ ఖర్చులు వృథా చేసుకోవద్దు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో హాజరుకండి.
మీ వాదనలు ఎంతసేపైనా వింటాం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని సీజేఐ చెప్పారు. సీజేఐ సూచనను మహిళ సున్నితంగా తిరస్కరించారు. తన జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని, తదుపరి విచారణకు కూడా తాను స్వయంగా వస్తానని పట్టుబట్టారు. దీంతో వచ్చే వారం ఈ కేసు కోసం ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. ఆ రోజు బోర్డు జాబితాలో ఈ కేసును మొదటి వరసలో ఉంచుతామని, ప్రత్యేక ధర్మాసనమే కేసును విచారిస్తుందని చెప్పారు.


