జమ్ముకశ్మీర్: ప్రస్తుతం జరుగుతున్న అమరనాథ్ యాత్ర సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. హిమాలయాల మంచు శిఖరాల నడుమ సాగే ఈ కఠినతరమైన ప్రయాణాన్ని పూర్తిగా పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా మార్చేందుకు అధికారులు ముందెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మకమైన వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్) మోడల్‌ను అమలు చేస్తున్నారు. 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్న ఈ యాత్రలో వ్యర్థాలను అదుపు చేయడమే కాకుండా, వాటి నుంచి ఇంధనాన్ని తయారు చేస్తూ దేశానికే ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తున్నారు.
ప్లాస్టిక్‌కు పాతర.. క్లాత్ బ్యాగుల పంపిణీ
అమరనాథ్ యాత్ర మార్గంలో సింగిల్ యూజ్ (ఒక్కసారి మాత్రమే వాడే) ప్లాస్టిక్‌పై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. భక్తులు ఎవరైనా పొరపాటున ప్లాస్టిక్ కవర్లతో బేస్ క్యాంప్‌కు చేరుకున్నా, వాటిని అక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేయడానికి దాదాపు 1.5 లక్షల గుడ్డ సంచులను సిద్ధం చేశారు. భోజన వసతి కల్పించే లంగర్లు, స్థానిక దుకాణదారులు కూడా కేవలం స్టీల్ ప్లేట్లు, గ్లాసులను మాత్రమే వాడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లాస్టిక్ గ్లాసులు వాడితే భారీ జరిమానాలు విధిస్తున్నారు.
గుర్రాల పేడతో గ్యాస్.. ఇంధనంగా మార్చే మిషన్లు
యాత్ర మార్గంలో భక్తులను చేరవేసేందుకు దాదాపు 25 నుండి 30 వేల వరకు గుర్రాలను ఉపయోగిస్తుంటారు. ఇవి ప్రతిరోజూ విసర్జించే టన్నుల కొద్దీ పేడను సేకరించడం ఒక పెద్ద సవాలుగా మారేది. అయితే ఈసారి తొలిసారిగా ఈ వ్యర్థాలను సేకరించేందుకు అత్యాధునిక యంత్రాలను రంగంలోకి దించారు. ఈ పేడను మీథేన్ గ్యాస్‌గా మార్చడానికి ఐదు క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బాలటాల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ మీథేన్ గ్యాస్‌తో వెలిగే ఒక ప్రత్యేకమైన ల్యాంప్‌ను కూడా ఏర్పాటు చేసి, వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఎలా తయారు చేయవచ్చో భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.
ఇండోర్ సంస్థ ‘స్వాహా’కు కీలక బాధ్యతలు
ఈ బృహత్తర పర్యావరణ పరిరక్షణ బాధ్యతను దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన ఇండోర్‌కు చెందిన ‘స్వాహా రిసోర్స్ మేనేజ్‌మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థకు బాబా అమరనాథ్ శ్రైన్ బోర్డ్ అప్పగించింది. జమ్ముకశ్మీర్ గ్రామీణ పారిశుద్ధ్య విభాగం దీనిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. యాత్ర మార్గంలో ఎక్కడా కొద్దిగా కూడా చెత్త పేరుకుపోకుండా, నిరంతరం సేకరించి ప్రాసెస్ చేస్తున్నారు. యాత్ర ముగిసిన తర్వాత కూడా ‘పర్యావరణ వీరులు’ ట్రాక్ మొత్తాన్ని జల్లెడ పట్టి, పూర్తిగా స్వచ్ఛంగా మార్చిన తర్వాతే అక్కడి నుండి కిందికి దిగుతారని సంస్థ సీఈఓ డాక్టర్ సమీర్ శర్మ తెలిపారు.
400 టన్నుల వ్యర్థాల నిర్వహణకు మాస్టర్ ప్లాన్
ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన యాత్రలో ఇప్పటికే 2.5 లక్షల మందికి పైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఈ సీజన్ ముగిసే సమయానికి భక్తుల సంఖ్య 5 నుండి 6 లక్షలకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల రెండు మార్గాల నుంచి సుమారు 400 నుండి 700 టన్నుల వరకు ఘన, ద్రవ వ్యర్థాలు జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడానికి ట్రాక్ పొడవునా పెద్ద ఎత్తున డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి 4,000 మందికి పైగా సిబ్బందిని, కేవలం వ్యర్థాల నిర్వహణ కోసమే మరో 623 మంది ఉద్యోగులను మోహరించారు.
వాటర్ ఏటీఎంలతో 30 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లకు చెక్!
సాధారణంగా పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వల్ల కాలుష్యం తీవ్రమౌతుంది. దీనిని అరికట్టడానికి యాత్ర మార్గంలో ఎనిమిది అత్యాధునిక ‘వాటర్ ఏటీఎం’లను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటీఎం 12 గంటల్లో సుమారు 6,000 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది. దీనివల్ల భక్తులు ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ వినూత్న ఆలోచన కారణంగా రోజుకు దాదాపు 50 వేల బాటిళ్లు, మొత్తం యాత్ర కాలంలో ఏకంగా 30 లక్షల ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం తగ్గుతుందని అధికారులు లెక్కగట్టారు.
వీధి నాటకాలతో అవేర్‌నెస్
లంగర్లు, విశ్రాంతి స్థలాల వద్ద పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా వీధి నాటకాలు , సాంప్రదాయ తోలుబొమ్మలాటలు (కట్పుత్లీ షోలు) నిర్వహిస్తున్నారు. యాత్రికులు తమ వెంట తిరిగి వాడుకోగలిగే స్టీలు ప్లేట్లు, స్పూన్లు తెచ్చుకోవాలని కోరుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, భక్తులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ యాత్రలో భాగస్వాములవుతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రాణాపాయంలో సోనమ్ వాంగ్‌చుక్


