న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధిలో జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు మృతి చెందడం, పలువురు గాయపడటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ మహ్మద్ జవాద్ హుస్సేనీతో సహా ఆ దేశ దౌత్యవేత్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.
ఒమన్ ప్రాదేశిక జలాల్లోని దక్షిణ షిప్పింగ్ లేన్‌లో ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసినట్లు యూఏఈ వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్లతో కలిపి మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ దాడులపై విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్య నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా ఉన్న హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.


