ఓ కుటుంబం ప్రాణభయంతో ఊరు విడిచింది.. ఇక ఆ ప్రమాదం తమ దరిచేరదని భావించింది. కానీ కాలం గడిచినా ఆ విషాద జ్ఞాపకం వారిని వెంటాడుతూనే వచ్చింది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత అదే ఏనుగు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొన్న ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నేపాల్‌లోని చిత్వన్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన.. మనిషి–వన్యప్రాణి ఘర్షణ ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి చూపించింది. ఏళ్ల క్రితం జరిగిన విషాదం నుంచి బయటపడేందుకు ఊరు మార్చుకున్న ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపించడం స్థానికులను సైతం విస్మయానికి గురిచేసింది.
2012లో మొదలైన విషాదం..
షానిచర బోటే కుటుంబానికి ఈ విషాద ప్రయాణం 2012లో మొదలైంది. చిత్వన్ నేషనల్ పార్క్ సమీపంలోని మడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో.. ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు దాడి చేసింది. ఆ ఘటనలో షానిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.
కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన షానిచర.. ఇక అక్కడ జీవించడం ప్రమాదకరమని భావించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్‌పూర్‌కు వలస వెళ్లారు. మధ్యలో రాప్తి నది కూడా ఉండటంతో.. ఇక ఆ ఏనుగు తమను చేరుకోలేదని భావించారు. అయితే విధి మరోలా రాసింది.
14 ఏళ్ల తర్వాత.. మళ్లీ అదే ఏనుగు
ఇటీవల జగత్‌పూర్‌లోని షానిచర కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి ధుర్బే ఏనుగు చేరుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ ఏనుగు దాడిలో షానిచర కోడలు అశికా బోటే (25), నాలుగేళ్ల మనవడు భారత్ బోటే మృతి చెందారు. “పెద్ద నదులు దాటి వెళ్లినా మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిపై దాడి చేసి నా కోడలు, చిన్న మనవడిని తీసుకెళ్లిపోయింది. ఇక మాకు పారిపోవడానికి చోటు లేదు” అని షానిచర బోటే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో ధుర్బే ఏనుగు కారణంగా ఒకే కుటుంబంలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 2012లో షానిచర తల్లిదండ్రులను బలిగొన్న ఇదే ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత ఆయన కోడలు, మనవడిని కూడా పొట్టన పెట్టుకుంది.
‘పగ’ కాదు.. కానీ వెంటాడిన విషాదం!
ఏనుగులు మనుషుల్లా పగ తీర్చుకుంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే ఒకే కుటుంబాన్ని 14 ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు విషాదంలోకి నెట్టిన ధుర్బే ఘటన మాత్రం అందరినీ కలచివేస్తోంది. ఒకప్పుడు తమ నుంచి దూరంగా వెళ్లిపోయిన కుటుంబం వద్దకే మళ్లీ అదే ఏనుగు చేరుకోవడం.. స్థానికుల్లో.. ఇది పగేనా?, అసలు ఎందుకు పగ బట్టింది?? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
25 మంది ప్రాణాలు తీసిన ధుర్బే
ధుర్బే నేపాల్‌లోని అత్యంత ప్రమాదకరమైన అడవి ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చిత్వన్ నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు పలుమార్లు ట్రాకింగ్ కాలర్లు అమర్చారు. 2016లో తొలిసారి కాలర్ అమర్చగా.. అది పనిచేయకపోవడంతో 2020లో మరోసారి, 2023లో మళ్లీ కొత్త కాలర్‌ను అమర్చారు. అయినప్పటికీ ధుర్బే కదలికలను పూర్తిగా నియంత్రించడం సవాల్‌గా మారింది.
పెరుగుతున్న మనిషి–ఏనుగు ఘర్షణ
అడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు చేరువ కావడంతో మనిషి–వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఆహారం, నీటి కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం.. ప్రజలు భయంతో జీవించాల్సి రావడం ఇలాంటి విషాదాలకు కారణమవుతోంది. 14 ఏళ్ల పాటు తప్పించుకున్నామని భావించిన ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ విషాదంలోకి నెట్టిన ఘటన ఇప్పుడు నేపాల్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.


