హెల్త్
అన్యురిజమ్స్ అంటే...!
దేహంలోని రక్తనాళాల్లో కొన్ని రక్తనాళాల పొరల నిడివి అంతటా ఒకే లాంటి మందం కలిగి ఉండకపోవచ్చు. ఆ రక్తనాళాల్లో కొన్ని కొన్నిచోట్ల బలహీనమైన చోట్లు / ప్రదేశాలు ఉండవచ్చు. మెదడులోనూ అల్లుకున్న రక్తనాళాల్లో బలహీనమైన చోట చిన్న బుడగలా ఉబ్బిపోయి... ఆ రక్తనాళపు పొర మరింత బలహీనపడ్డవేళ ఒక్కోసారి అది ఒక్కసారిగా చిట్లిపోతే మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా మెదడులో రక్తనాళాల్లో ఎక్కడైనా బలహీనమైన ప్రాంతం ఉండి, అక్కడ రక్తం బుడగలా మారడాన్ని ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’ అంటారు. ఆ బలహీనమైన రక్తనాళ పొర అకస్మాత్తుగా చిట్లిపోవడం జరిగితే అది ఆ వ్యక్తికి అదిప్రాణాంతకంగా మారవచ్చు. ఇలా రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి... అది చిట్లిపొవడం ఎందుకు, అలా రక్తనాళపు పొరలు బలహీనపడి ‘అన్యురిజమ్’గా దారితీసే పరిస్థితులేమిటి లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
దాదాపు 30 నుంచి 40 ఏళ్ల కిందట ‘అన్యురిజమ్స్’పై వైద్యవర్గాల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పేషెంట్ ఆకస్మికంగా చనిపోతే అది ఎందువల్లనో తెలియని పరిస్థితే ఎక్కువగా ఉండేది. సుమారు 30 ఏళ్ల కిందట ప్రతి లక్షమందిలో 5 నుంచి 10 మంది అన్యురిజమ్స్‌తో చనిపోయినా... అప్పట్లో ఆ మరణాలకు కారణం పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే కారణం తెలిసేలోపే పేషెంట్ మరణించే పరిస్థితులే ఎక్కువగా ఉండేవి. ఈ అన్యురిజమ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
మెదడులో వచ్చే అన్యూరిజమ్‌లు (సెరిబ్రల్ ఎన్యురిజమ్స్)
మెదడు అన్యూరిజమ్ (సెరిబ్రల్ / ఇంట్రాక్రేనియల్ ఎన్యురిజమ్) అనేది మెదడులోని ఒక ధమని (ఆర్టరీ) గోడలోని లోపలి పొర బలహీనపడటం వల్ల ఆ రక్తనాళం ఒక చిన్న బుడగ (బ్లిస్టర్) లాగా ఉబ్బిపోవడం. ఈ ఉబ్బిన భాగం క్రమంగా చాలా పలుచగా మారి ఎలాంటి సూచనగానీ హెచ్చరికగానీ ఇవ్వకుండానే చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా అన్యూరిజమ్ చిట్లిపోయినప్పుడు మెదడు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రక్తస్రావం జరుగుతుంది. దీనిని సబ్ అరాక్నాయిడ్ హీమరేజ్ (ఎస్‌ఏహెచ్) అంటారు. ఇటువంటి రక్తస్రావాలలో సుమారు 90% అన్యూరిజమ్ చిట్లిపోవడం వల్లే సంభవిస్తాయి. ఇది పక్షవాతం (స్ట్రోక్), కోమా లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.
మెదడు అన్యూరిజమ్ ఏర్పడడానికి కారణాలు
- అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)
- పొగతాగడం (సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లాంటి అలవాట్లు)
- పుట్టుకతో వచ్చే (జన్యుపరమైన) కారణాలతో.
- రక్తనాళాలకు గాయం లేదా దెబ్బతగలడం
- కొన్ని రకాల బ్లడ్ ఇన్ ఫెక్షన్ల కారణంగా వచ్చే పరిణామాలతో.
అన్యూరిజమ్ ఎలా చిట్లుతుందంటే...
- అన్యూరిజమ్ సంచిలో (స్యాక్) చిన్న రంధ్రం ఏర్పడినప్పుడు అది చిట్లినట్లుగా భావిస్తారు.
- రంధ్రం చిన్నదైతే కొద్దిపాటి రక్తం మాత్రమే లీక్ అవుతుంది.
- రంధ్రం పెద్దదైతే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది.
- చిట్లని అన్యూరిజమ్ (అన్ రప్చర్‌డ్ అన్యురిజమ్) అంటే ఇంతకుముందు ఎప్పుడూ రక్తం లీక్ కాని అన్యూరిజమ్.
పగలని (అన్ రప్ఛర్‌డ్) అన్యూరిజమ్ లక్షణాలు
- పక్షవాతం (స్ట్రోక్ ) – 37%
- తలనొప్పి – 37%
- ఫిట్స్ (మూర్ఛ) – 18%
- చూపు సమస్యలు – 29%
పగిలిన (రప్చర్‌డ్) అన్యూరిజమ్ లక్షణాలు
- జీవితంలో ఎన్నడూ / ఎప్పుడూ అనుభవించని తీవ్రమైన తలనొప్పి
- స్పృహ కోల్పోవడం
- పక్షవాతం (స్ట్రోక్)
- మాట్లాడలేకపోవడం, నోరు ఒకవైపు వంగిపోవడం
- ఫిట్స్ (మూర్ఛ)
చికిత్స విధానాలు...
- ఔషధ చికిత్స (మెడికల్ / నాన్ సర్జికల్ థెరపీ)
- శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్) ∙ఎండోవాస్క్యులర్ చికిత్స (ఎండోవాస్క్యులార్ కాయిలింగ్)
- అవసరమైతే స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో
మన దేశంలోని పరిస్థితి ఇది...
ప్రతి ఏటా మన దేశంలో ప్రతి లక్షమందికి పది నుంచి పన్నెండు మందికి పైగా అన్యురిజమ్ బారిన పడుతున్నట్లు ఓ అంచనా. ఇటీవల వీరి సంఖ్య పెరిగినట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మంది మృతిచెందుతుంటారు. బతికి బయటపడ్డ వారిలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది ఏదో ఒక రకమైన వైకల్యం లేదా అవయవలోపం కలుగుతుంది. అంటే వారు ఏదో ఒక రకమైన న్యూరలాజికల్ డెఫిసిట్‌తో బాధపడాల్సిన పరిస్థితి. మెదడులో రక్తస్రావమై... అది అవయవాలను నియంత్రించే సెంటర్లపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.
కొందరిలో జీవితకాలంలో బయటపడకపోవచ్చు...
అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు కొంత బలహీనంగా ఉండవచ్చు. చాలా బలహీనంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ అదృష్టవశాత్తు జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. ఉదాహరణకు ఒక రక్తనాళంలో అంగుళంలో ఎనిమిదో వంతు ఉండే అన్యురిజమ్స్‌లో 50 శాతం నుంచి 80 శాతం ఎప్పటికీ చిట్లకపోవచ్చు. ఇక కొందరిలో ఈ రక్తనాళాల్లోని ఉబ్బు అంగుళం కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. వీటినే ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటి జెయింట్ అన్యురిజమ్స్ అకస్మాత్తుగా చిట్లడానికి ఆస్కారం ఉంది. ఇవి చిట్లాక రోగికి అకస్మాత్తుగా పక్షవాతం రావచ్చు.

నిర్ధారణ కోసం సెరిబ్రల్ ఏంజియోగ్రామ్...
గుండెపోటు వచ్చిన వారిలో నిర్ధారణ కోసం చేసే యాంజియోగ్రామ్ పరీక్ష లాగే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇందులో న్యూరోఇంటర్వెన్షనల్ సర్జన్ ఒక ట్యూబ్ ద్వారా మెదడు రక్తనాళాల వరకు చేరి... అక్కడ ఒకరకమైన రంగు పదార్థాన్ని (డై అని పిలిచే రంగుపదార్థం) మెదడులోని రక్తనాళాల్లోకి వదులుతారు. దాంతో ఆ రంగు పదార్థం రక్తనాళాల్లో చేరి ఉబ్బినట్లుగా ఉన్న ప్రాంతాలను (అన్యురిజమ్స్‌ను) స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి చిత్రాలను చూపించే ప్రక్రియను ‘ఫ్లోరోస్కోప్’గా చెబుతారు. ఈ చిత్రాల సహాయంతో మెదడులోని ఏయే ప్రాంతాల్లో అన్యురిజమ్స్ ఉన్నాయి, వాటి పరిమాణం, ఆకృతి వంటి అనేక కీలకమైన అంశాలను తెలుసుకోగలుగుతారు. వాటి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు.
అన్యురిజమ్ మెదడులోనే వస్తాయా?
అన్యురిజమ్స్ అంటే బలహీనమైన చోట్లలో రక్తనాళాలు ఉబ్బడం. అది దేహంలోని ఏ ప్రాంతలో ఉన్న రక్తనాళల్లోనైనా జరగవచ్చు. అయితే... దేహంలోని మిగతా ప్రాంతాల్లో అలా ఉబ్బు రావడం లేదా చిట్లడం వల్ల తక్షణ ప్రమాదంగానీ లేదాప్రాణాపాయంగానీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మెదడు విషయంలో అలా కాదు. మెదడులో రక్తస్రావం జరిగితే... శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలనూ, అలాగే దేహ భాగాలను నియంత్రించే నాడులు అక్కడే ఉంటాయి కాబట్టి అవి దెబ్బతినిప్రాణాపాయం కలిగే అవకాశాలెక్కువ. అందుకే మెదడులో సంభవించే అన్యురిజమ్‌ను తేలికగా తీసుకోకూడదు. ఇలా మెదడులో వచ్చే అన్యురిజమ్స్‌ను ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’గా చెబుతారు. మిగతా చోట్ల వచ్చే వాటిని దేహంలోని ఆ ప్రదేశం పేరుతో చెబుతారు. ఉదాహరణకు ఛాతీ ప్రాంతంలో వస్తే వాటిని థొరాసిక్ అన్యురిజమ్స్ అని పేర్కొంటారు.
1. మందులతో చేసే చికిత్స (మెడికల్ థెరపీ)
ఈ చికిత్స సాధారణంగా చిట్లిపోని (అన్ రప్చర్‌డ్) అన్యూరిజమ్‌లకు మాత్రమే ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ప్రధానంగా...
- పొగతాగే అలవాటు పూర్తిగా మానేయడం
- రక్తపోటును నియంత్రణలో ఉంచడం
- వైద్యుడు సూచించిన ఆహార నియమాలు పాటించడం
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
ఈ చర్యలే అన్యూరిజమ్ ఏర్పడటం, పెరగడం లేదా చిట్లుపోవడం వంటి ముప్పులను తప్పించడానికి దోహదపడేవిగా నిరూపితమయ్యాయి.
అలాగే, అన్యూరిజమ్ పరిమాణం లేదా పెరుగుదలను గమనించేందుకు డాక్టర్లు అవసరాన్ని ఎమ్మారై, సీటీ స్కాన్ లేదా సంప్రదాయ యాంజియోగ్రఫీ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయాలని సూచించవచ్చు.
2. శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్)
ఈ విధానంలో క్రేనియోటమీ అనే శస్త్రచికిత్స ద్వారా పుర్రెలో చిన్న రంధ్రం చేసి మెదడును, అలాగే ప్రభావితమైన రక్తనాళాల వరకు చేరుకుంటారు. అన్యూరిజమ్‌ను గుర్తించిన తర్వాత, చుట్టూ ఉన్న మెదడు కణజాలం నుంచి దాన్ని (అన్యురజమ్‌ను) జాగ్రత్తగా వేరుచేస్తారు.
తర్వాత టైటానియంతో తయారు చేసిన చిన్న మెటల్ క్లిప్‌ను అన్యూరిజమ్ వచ్చిన ప్రాంతంలో (దీన్ని సాధారణంగా నెక్ అని వ్యవహరిస్తారు) వద్ద అమర్చుతారు. దీంతో అన్యూరిజమ్‌లోకి రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. దాంతో మెదడులో సాధారణ రక్తప్రసరణ తిరిగి కొనసాగుతుంది.
3. ఎండోవాస్క్యులర్ కాయిలింగ్
ఈ విధానంలో కాలులోని ఫెమొరల్ ఆర్టరీ ద్వారా ఒక క్యాథెటర్‌ను ప్రవేశపెట్టి, దాని ద్వారా చిన్న మైక్రోక్యాథెటర్‌ను అన్యూరిజమ్ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అన్యూరిజమ్ లోపల ప్రత్యేకమైన మెటల్ కాయిల్స్ వేస్తారు. దీంతో అన్యూరిజమ్‌లో రక్తప్రవాహం ఆగి అది మూసుకుపోతుంది.
ఈ చికిత్సలో తల / పుర్రె (స్కల్)ను తెరవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల శస్త్రచికిత్స చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.
మత్తుమందు (అనస్థీషియా) అవసరం కూడా తక్కువే. చాలా వేగంగా కోలుకుంటారు.
4. స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్
కొన్ని సంక్లిష్టమైన అన్యూరిజమ్‌లలో... మరీ ముఖ్యంగా వెడ్ నెక్‌డ్ అన్యురిజమ్ అనే అన్యురిజమ్స్‌లో లేదా పెద్ద లేదా అతి పెద్ద (లార్జ్ అండ్ జెయింట్ అన్యురిజమ్) వంటి సందర్భాల్లో స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కాయిల్స్ ప్రధాన రక్తనాళంలోకి జారిపోకుండా నివారించవచ్చు. లేదంటే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం ఉంటుంది.
బెలూన్–అసిస్టెడ్ కాయిలింగ్లో, కాయిల్స్ వేస్తున్న సమయంలో అన్యూరిజమ్ నెక్ ప్రాంతంలో బెలూన్ ను తాత్కాలికంగా ఉబ్బించి ఉంచుతారు.
5. ఫ్లో డైవర్షన్
అన్యూరిజమ్ చికిత్స కోసం సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఫ్లో డైవర్టర్ (ఎఫ్‌డీ) స్టెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ట్యూబ్ ఆకారంలో ఉండే ప్రత్యేక స్టెంట్‌లు. ఇవి రక్తప్రవాహాన్ని అన్యూరిజమ్ వైపు వెళ్లకుండా మళ్లిస్తాయి. దీంతో అన్యూరిజమ్ స్యాక్‌లోకి వెళ్లే రక్తప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా అన్యూరిజమ్ నెమ్మదిగా పూర్తిగా మూసుకుపోయి, కాలక్రమేణా సహజంగా నయమవుతుంది.
చికిత్సలో ఎదురయ్యే సవాళ్లు
చిట్లిన లేదా చిట్లని... ఇలా రెండు రకాల మెదడు అన్యూరిజమ్‌ల చికిత్సలు ఇటు పేషెంట్‌కూ, అటు డాక్టర్లకూ ఓ పెద్ద సవాలుగా మారడం చాలా సాధారణం.
గుండెపోటు లాగే అన్యురిజమ్ కూడా...
అన్యురిజమ్స్‌తో వచ్చే పరిణామాలను మనం గుండెజబ్బు అనంతర పరిణామాలతో పోల్చవచ్చు. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగానే అన్యురిజమ్స్ కూడా అంతే అకస్మాత్తుగా రావచ్చు. గుండెపోటు విషయంలో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక చేరినందువల్ల అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తే... అన్యురిజమ్స్ విషయంలో మాత్రం మెదడుకు చేరవేసే రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెపోటుకు పొగాకు వాడకం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) రిస్క్ ఫ్యాక్టర్లు అయినట్లుగానే... దీనికీ పొగాకు, ఫ్యామిలీ హిస్టరీలే పెద్ద రిస్క్ ఫ్యాకర్లు.
మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కూడా...
శరీర నిర్మాణానికి దోహదపడే కొన్నిప్రోటీన్లకు సంబంధించిన జబ్బులు (ఉదాహరణకు ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫన్స్ సిండ్రోమ్), కండరాల జబ్బు అయిన ఫైబ్రోమస్క్యులార్ డిస్‌ప్లేసియా, దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు, కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి అన్యురిజమ్స్ ఉండటం, కోకెయిన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకునే దురలవాటు, మూత్రపిండాల్లో నీటితిత్తుల ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండటం... అన్యురిజమ్‌కు రిస్క్‌ఫ్యాక్టర్లు.
గ్లాస్‌గో కోమా స్కేల్‌పై తీవ్రత కొలతతో గ్రేడింగ్...
అన్యురిజమ్స్ కారణంగా కానీ లేదా ఇతరత్రాగానీ... ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు దాని తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే స్కేల్‌ను గ్లాస్‌గో కోమా స్కేల్‌గా అంటారు. ఇందులో ఒక్కోరకమైన స్పందనకు ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు పేషెంట్ కంటి కదలికలకూ, డాక్టర్ మాటలకు పేషెంట్ స్పందించే తీరుకూ, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ పేషెంట్ నుంచి స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అదే ఆదేశాలకు పేషెంట్ స్పందిస్తున్న కొద్దీ గ్లాస్‌గో కోమా స్కేల్‌పై స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది పేషెంట్ నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అని అర్థం. అదే స్కోర్ పెరుగుతూ... అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. ఈ స్కోర్‌ను బట్టి అన్యురిజమ్స్ కారణంగా సబర్కనాయిడ్ హామరేజ్ జరిగినప్పుడు పేషెంట్‌లో దాని తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ ఆమోదించిన గ్రేడింగ్ ప్రక్రియ ఇది).
హేమరేజ్ జరిగిన కేసుల్లో పేషెంట్ తాలూకు గ్లాస్‌గో కోమా స్కేల్‌పై కొలతల గ్రేడ్...
- స్కోరు 15 ఉంటే రోగి కోలుకోవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి.
- స్కోరు 3 ఉంటే రోగి కోలుకోడానికి అవకాశాలు ఉండవు.
- స్కోరు 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రోగి కోలుకోవడానికి మంచి అవకాశాలుంటాయి.
- స్కోరు 3 – 5 ఉంటే అది ప్రమాదకరమైన స్థితి.
చివరగా... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కాస్త ఎక్కువగా కనిపించే ఈ కేసులు ఇటీవల మన దేశంలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో మన దగ్గర వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు అంతగా అందుబాటులో లేవు. కానీ ఇప్పుడా పరీక్షలు, వాటితో పాటు సరికొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి రావడంతో మన దగ్గర కూడా ఆ పేషెంట్ల వివరాలు తెలియడంతో పాటు చాలామందిని రక్షించడమూ ఇప్పుడు సాధ్యమవుతోంది.
- డా. కిశోర్ కుమార్, సీనియర్ న్యూరో సర్జన్
- నిర్వహణ: యాసీన్


