తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఉపాధి! | High Profits From Backyard Poultry Farming Sagubadi | Sakshi
Sakshi News home page

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఉపాధి!

Jul 14 2026 9:29 AM | Updated on Jul 14 2026 9:29 AM

High Profits From Backyard Poultry Farming Sagubadi

సాగుబడి

మన దేశంలో గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, పోషకాహార భద్రతను పటిష్టం చేయడానికి పెరటి కోళ్ళ పెంపకం ఒక శక్తివంతమైన సాధనంగా అవతరించిందని భువనేశ్వర్‌లోని కేంద్రీయ మహిళా వ్యవసాయ సంస్థ (ఐసిఎఆర్‌–సిఐడబ్ల్యూఏ) శాస్త్రవేత్త డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ పాండా తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధిని, మహిళా సాధికారతను అందించే ఈ రంగంపై డా. అరుణ్‌ కుమార్‌ పాండా ఏమంటున్నారంటే..

అంతరం... దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అయితే, వాణిజ్యపరమైన కోళ్ళ పరిశ్రమల లాభాలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడిమాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. 2019 పశుగణన ప్రకారం.. దేశంలో పెరటి కోళ్ళ సంఖ్య 31.37 కోట్లకు చేరింది. మొత్తం గుడ్ల ఉత్పత్తిలో పెరటి గుడ్ల వాటా 21 శాతం ఉంటుంది.

మహిళా సాధికారత... సాధారణంగా గ్రామాల్లో పెరటి కోళ్ళ నిర్వహణ, వాటికి మేత వేయటం, గుడ్ల అమ్మకం వంటి పనులన్నీ మహిళలే చూసుకుంటారు. దీనివల్ల వచ్చే అదనపు ఆదాయం వల్ల వారి కుటుంబ నిర్ణయాధికారం పెరిగి, సామాజిక హోదా మెరుగుపడుతుంది. ఇది స్త్రీ పురుష సమానత్వానికి దారితీస్తుంది.


లాభసాటి కావాలంటే..? పెరటి కోళ్ళ పెంపకంలో తక్కువ ఉత్పాదకత, కొక్కెర వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు, సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యలు. వీటిని అధిగమించడానికి గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను ప్రభుత్వాలు పంపిణీ చేయాలి. స్థానికంగా లభించే మేతను వాడుకోవటం, మహిళలకు వ్యాక్సినేష¯Œ పై శిక్షణ ఇవ్వటం, మహిళా సహకార సంఘాల ద్వారా గ్రామీణ మార్కెట్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపడితేనే కుటుంబ స్థాయిలో పెరటి కోళ్ళ పెంపకం మరింత లాభసాటిగా మారుతుంది. 

గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, శ్రీనిధి వంటి మేలైన పెరటి కోడి పిల్లల కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌ అనుబంధ సంస్థ ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రీసెర్చ్‌’ను సంప్రదించవచ్చు. హెల్ప్‌ లైన్‌: 040–24015651.

కోడిగుడ్డులో 44 పోషకాలు
గ్రామీణప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలోప్రోటీన్ల లోపం ఉంటుంది. మానవ శరీరానికి అవసరమైన 45 రకాల పోషకాల్లో 44 పోషకాలు కోడిగుడ్డులో లభిస్తాయి. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైనప్రోటీన్‌ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతంప్రోటీన్‌ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

- ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement