జ్వరాన్ని తగ్గించడంలో.. ఉల్లింద పండ్ల ప్రత్యేకత | Sagubadi: Uses Of Wild Fruits Ullinda Genus | Sakshi
Sakshi News home page

జ్వరాన్ని తగ్గించడంలో.. ఉల్లింద పండ్ల ప్రత్యేకత

Jul 3 2026 11:11 AM | Updated on Jul 3 2026 11:33 AM

Sagubadi: Uses Of Wild Fruits Ullinda Genus

సాగుబడి: ఉల్లింత పండ్లు

ఉల్లింద జీనస్‌లో అనేక రకాల జాతులున్నాయి. అడవి పండ్ల జాతుల్లో ఉల్లింద పండ్లకు ప్రత్యేకత ఉంది. వీటికి ఉన్న ఔషధ గుణాలే అందుకు కారణం. దీనిపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.

ఉనికి: ఉల్లింద చెట్టు ఉష్ణమండలంలోని చిట్టడవులు, అడవులు, మైదానం ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆకులు రాల్చే తత్వం గలది. ఈ చెట్టు కొన్ని సందర్భాల్లో గొడుగు ఆకారం 6–10 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. ఇంచుమించు అన్నిరకాల నేలల్లో (చౌడు భూములు తప్ప) పెరుగుతుంది. విత్తనం ద్వారానే దీని ప్రవర్ధనం జరుగుతుంది. దీని పండు మొదలు ఆకుపచ్చగా ఉండి, పండినప్పుడు ఆరంజ్‌–ఎరుపుగా మారుతుంది.

దీని స్వస్థలం మధ్య–దక్షిణ ఇండియా, బంగ్లాదేశ్‌ ఇతర ఉష్ణమండల దేశాలై ఉండవచ్చు. ఇండియాలో మాత్రం దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ (నల్లమల అడవులు), కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉంది. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది. నల్లమల అడవుల్లో ఈ చెట్లు అధికంగానే ఉన్నాయి. అడవి విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. మొత్తానికి దీనిపై పరిశోధన చెప్పుకున్నంత జరగలేదు.

ఉల్లింద ఉపయోగాలు:

  • ఆకులు వగరుగా ఉన్నా మేకలు ఇష్టంగా తింటాయి. ఇది సతత హరితం. కాబట్టి వేసవిలో కూడా ఆకుల లభ్యత ఉంటుంది.

  • పండ్లు వగరు–తీపిని కలబోసినట్లుగా ఉంటాయి. పండ్లు చిన్నవిగా, గుండ్రంగా ఉండి నిగనిగలాడుతుంటాయి. ఈ పండ్లను చక్కెర భీమారి ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు.

  • వంట చెరకుగా ఉపయోగపడుతుంది.

  • వీటి ఆకుల రసం రెండు పూటలా తాగిస్తే విరేచనాలు తగ్గుతాయి.

  • ఈ పండ్లు తింటే అజీర్తి నివారింపబడుతుంది.

  • ఎండిన పూల పొడిని నీటిలో కలిపి తాగించడం వల్ల మూత్రకోశ వ్యాధులు నివారించబడతాయి.

  • ఉల్లిందను సిద్ధ ఔషధంలో విరివిగా వాడతారు.

  • జ్వరాన్ని తగ్గించడంలో ఈ చెట్టుకు మంచి పేరుంది. చెట్టు బెరుడు/మాను పెచ్చులను నానబెట్టి మొక్కలపై చల్లినట్లైతే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చు.

నల్లమల అడవులు..
నలమల అడవులు ఆవరించిన అన్ని జిల్లాల్లో ఈ చెట్లు ఉన్నాయి. పశువుల కాపరులకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఇది ఎప్పుడూ ఆకులతో పచ్చగా ఉండడం వల్ల ఎండాకాలంలో నీడతో ΄ాటు పండ్లు కూడా లభిస్తాయి. సేద తీర్చుకోవటానికి నీడనిచ్చే మంచి చెట్టు.

ఈ చెట్లపై లోతైన పరిశోధనలు జరగలేదు. దేశంలో కొన్నిప్రాంతాలకే పరిమితం కావడం ఒక కారణం అయితే ఎక్కువగా అడవుల్లోనే ఇవి ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఈ పండ్లకు ఔషధ, పోషక విలువలు ఉన్నందు వల్ల లోతైన పరిశోధనల అవసరం ఎంతైనా ఉంది. అట్లే వీటిని ఆగ్రోఫారెస్ట్రీలో భాగం చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉల్లింద పండ్ల చెట్లు ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అడవుల్లో కూడా ఉన్నాయి. ఈ పండ్లలో పీచు పదార్ధం అధికంగా ఉన్నందున తినే ఆహారం అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

ఉల్లింద చెట్టు పేర్లు: 
ఇంగ్లీష్‌: గ్రీన్‌ ఎబోని పర్సిమోన్‌ ఒరియా: బండోడి, గౌర్కస, కొసై కన్నడ: జగలగంటి, నిన్నె, నేన్సి, కరగరి యంతుమర తమిళం: కరువక్కనై, పెరియులిన్సి, వక్కనై తెలుగు: ఇల్లింటు, కవకీమాను, ఉల్లింద, కోషవో, నేల ఇల్మీర, ఇల్లింద, తొరిక, వల్లంజ, పుల్లిండే, పెద్ద ఉల్లింద, పెద్దఉలిని, కాయకిమాను మరాఠీ: నేన్సి, నినై హిందీ: కలటెండు, కిన్నూ. - డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement