సాగుబడి
అడవి పండ్ల జాతి –14
English Name: Spinons Kino tree/ Indian Laurel fig
శాస్త్రీయ నామం: బ్రిడేలియా రేటు
Scientific Name: Bridelia retusa (L) A. Juss Synonym(s): Bridolia spinosa (Roxb.) Wild. / Clutia retusa L.
కుటుంబం: యుఫర్బేసి
Farm-ily: Euphorbiaceae
వివిధ భాషల్లో ‘కోరమాను’ చెట్టు పేర్లు:
అస్సామీ: కుహిర్, కుహిట్, కున్ హి
ఇంగ్లిష్: సైనోంన్స్ కినోటి, ఇండియన్ లారెల్ ఫిగ్
కన్నడ: మల్లు హన్నె మర, కోవే ముల్లు హన్నె, ముల్లు జోగల, ఆసన, గుజ్జు, కోమంచి, కొయ్యముంచి, బీల్ కుంబె
తమిళం: ముల్లు వెంగై, అదమరుడు, కడుగా
తెలుగు: బొంతవేగి, కొరమాను, కోరమద్ధి, కోడేరు, దుర్వమద్ది, మల్లుమద్ది, పైమద్ది
మరాఠీ: ఆసన
మలయాళం: ముల్కెని, ఉల్లు వెంగ
బెంగాలీ: జైయో
హిందీ: కాజి, ఖజ, కస్సై కట్టి దామన్
సంస్కృతం: ఆసన, ఏకవీర, మహావీర
పూత:
ఏప్రిల్ – మే
పండ్లు:
జులై – ఆగస్టు (పూత, కాతలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. నేల, వాతావరణం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు).
ఉనికి...
కోరమాను చెట్టు దాదాపు 10–15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్ల లేత దశలో కాండంపై కురుచటి ముళ్లు ఉంటాయి. చెట్లు ఎదుగుతున్నపుడు ముళ్లు మొద్దుబారతాయి. ఈ చెట్లు సముద్ర మట్టానికి 650 – 1000 మీటర్ల ఎత్తయిన ్రపాంతాల్లోని అడవుల్లో కూడా పెరుగుతాయి. ఈ చెట్లు బెట్టెను తట్టుకోగలవు.
కోరమద్దికి సక్కర్లు (వేరు బయటకు కనబడ్డ దగ్గర నేల పైకి పొడుచుకు వచ్చే మొలకలు) వచ్చే గుణం ఉంది. వీటి ఆవాసం ఈస్ట్ ఆసియా, చైనా, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా. నల్లమల అడవుల్లో కూడా వీటి ఉనికి కనిపిస్తుంది. ఇదే తెగకు చెందిన దాదాపు 10 జాతులు నల్లమలలో ఉన్నవి. (Reddy et al., 1991). ఈ చెట్లు ఎక్కువగా ఆకులు రాల్చే ఉష్ణమండలపు అడవుల్లో ఉంటాయి.
ఉపయోగాలు...
కొరమాను పండ్లు ముదురు గోధుమ రంగులో గుండ్రంగా ఉంటాయి. వీటిని తింటారు. వగరు+తీపి రుచితో ఉంటాయి. వీటి పూలు మంచి వాసనను వెదజల్లుతూ ఉంటాయి. చెట్లు పూత దశలో ఉన్నప్పుడు తేనెటీగలకు మంచి నేస్తాలుగా మారతాయి.
ఎండిన చెట్లు వంట చెరుకుగా, ఫర్నీచర్ తయారికి ఉపయోగపడతాయి.
ఈ చెట్టుకు కీటక నాశక గుణాలున్నాయి.
ధాన్యాన్ని నిల్వ చేయటానికి గాదెపై కోరమద్ది చెక్క వేస్తే గింజలకు పురుగు పట్టదు.
ఈ చెట్టు బెరడును విరేచనాలు తగ్గించడానికి వాడతారు.
వీటి ఆకులు, బెరడు, వేర్లను నాటు వైద్యంలో అనేక రోగాలను ముఖ్యంగా మలేరియా, రక్తహీనత, ఆస్తమా, చక్కెర రోగం, విరేచనాలు, క్యాన్సర్, సుఖరోగాలు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, మూత్ర నాళ సమస్యలు, కామెర్లు, పుండ్లు తదితర రోగాలను నయం చేయటానికి వాడుతుంటారు.
జీవ వైవిధ్యంలో ఈ చెట్టుకు కూడా స్థానం ఉంది. ఈ చెట్లను పంటలతో పాటు కలిపి ఆగ్రో ఫారెస్ట్రీలో పెంచవచ్చు.
ఈ చెట్ల పండ్ల నుంచి జ్యూస్ తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వీటి ఆకులు, పండ్లు, బెరడు, వేర్లలో ఫైటోకెమికల్స్ (స్టెరాయిడ్స్, ట్యానిన్స్, ఫినాల్స్, ఫ్లెవోనైడ్స్, సపోనిన్స్ ఉంటాయి. Rupali et a ., 2016).
ఈ చెట్లకు ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో, నాటు వైద్యంలో, యునానీ, హోమియోపతిలో మంచి పేరుంది.
మాగిన కోరమాను పండ్లలో ఆల్ఫా–సిటోస్టిరాల్, గ్యాలిక్, ఎల్లెజిక్ ఆమ్లాలు ఉంటాయి. (Mahapatra and Panda, 2009).
ఎన్నో విలువలు ఉన్న ఈ జాతి పండ్ల చెట్లు పంట పొలాల్లో పెంచితే జనాలకు ఎంతో ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఈ పండ్ల చెట్లపై పరిశోధనలు ఎంతో అవసరం. అట్లే ఈ చెట్ల ఉనికిని కాపాడటానికి నల్లమలలో అధిక మొత్తంలో నాటటం ఎంతైనా అవసరం.
కోరమాను పండ్లను పక్షులు బాగా ఇష్టపడతాయి.

- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924


