మీనాల్ గెల్టింక్ (43), మీనాల్ టిజ్సెన్ (44)
రియల్ రీల్
పజిల్ వీడింది... సిస్టర్ దొరికింది!
కథల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని అద్భుత సంఘటనలు... కొన్నిసార్లు నిజజీవితంలోనూ చోటుచేసుకుంటుంటాయి. అలాంటి సంఘటనే ఇది. పుట్టిన కొన్నిరోజులకే వేర్వేరు అనాథాశ్రమాలకు చేరి, వేర్వేరు కుటుంబాల్లో పెరిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. నాలుగు దశాబ్దాల తర్వాత డీఎన్‌ఏ టెస్టు ద్వారా తిరిగి ఒకటయ్యారు.
భారతదేశంలో పుట్టిన మీనా గెల్టింక్ (43), మీనాల్ టిజ్సెన్ (44)లను చిన్నప్పుడే నెదర్లాండ్స్‌కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. వారిద్దరు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే పెరుగుతున్నప్పటికీ తమకు ఒక తోబుట్టువు ఉందనే విషయం ఇద్దరికీ తెలియదు. అయితే 1996లో దత్తత పిల్ల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిమధ్య స్నేహం ఏర్పడి... సరదాగా ఉత్తరాలలో ‘సిస్’ అని పిలుచుకునేవారు. కానీ కాలక్రమేణా వీరిమధ్య సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 15 ఏళ్లపాటు దూరంగా ఉన్నారు.
అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘మై హెరిటేజ్’ యాప్ ద్వారా చేసిన డీఎన్‌ఏ పరీక్ష వీరి జీవితాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఫ్రాన్స్‌లో ఉంటున్న మీనాల్ ఫోన్‌కి ఒకరోజు ‘మీనాల్ యువర్ సిస్టర్... 100 శాతం డీఎన్‌ఏ మ్యాచ్’ అని నోటిఫికేషన్ వచ్చింది. మొదట నమ్మలేకపోయిన మీనాల్, సోషల్ మీడియాలో వెతికి పాత ఫోటోలను పరిశీలించాక... 30 ఏళ్ల క్రితం కలిసిన ఆనాటి టీనేజ్ స్నేహితురాలే తన సొంత చెల్లెలని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వీరిద్దరూ నెదర్లాండ్స్‌లో ఎంతో సంతోషంగా కలుసుకున్నారు.
పెంచిన తల్లిదండ్రులున్నప్పటికీ ఇంతకాలం ఏదో ఒక తెలియని లోటు ఉండేదని... తన సోదరి రాకతో జీవితంలో తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్లుందని మీనా చెబుతోంది. అయితే ‘‘తాము అక్కాచెల్లెళ్లమని తెలియకముందే మంచి స్నేహితులం. నిజానికి మేము మొదటినుంచీ అక్కాచెల్లెళ్లమే, కాకపోతే ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసిందని’’ ఈ సందర్భంగా మీనాల్ చెబుతోంది.


