బయటి అందం కాదు.. అంతరంగ పవిత్రతే అసలైన అందం! | Inspiration And Devotional Story On Purity Inner Peace Kundalini Spiritual Awareness | Sakshi
Sakshi News home page

బయటి అందం కాదు.. అంతరంగ పవిత్రతే అసలైన అందం!

Aug 13 2026 9:59 AM | Updated on Aug 13 2026 10:10 AM

Inspiration And Devotional Story On Purity Inner Peace Kundalini Spiritual Awareness

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

నిర్మల వాణి

శ్రీ మాతాజీ నిర్మలాదేవి

ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, మనిషి అన్వేషణ మాత్రం ఒకటే–శాంతి, ఆనందం, పరిపూర్ణత. ధనం, హోదా, సాంకేతిక విజ్ఞానం, సామాజిక గుర్తింపుం ఇవన్నీ జీవితాన్ని సౌకర్యవంతం చేయగలవేమో గానీ, అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచలేవు. మనసులో కలత, అసంతృప్తి, భయం, అసూయ, కోపం, అహంకారం వంటి భావాలు తొలగినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.

ఆ అంతరంగ శాంతికి, ఆత్మసాక్షాత్కారానికి, దైవానుభూతికి మూలం పవిత్రత అని భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. సహజయోగ వ్యవస్థాపకురాలు పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1985 ఆగస్టు 4న ఇచ్చిన సందేశంలో ఈ సత్యాన్ని అత్యంత సరళంగా వివరించారు. ఆమె మాటల్లో ‘‘పవిత్రత కుండలినిని బలపరుస్తుంది.’’ ఈ ఒక్క వాక్యంలోనే ఆధ్యాత్మిక జీవిత సారాంశం దాగి ఉంది.

కుండలిని అంటే ఏమిటి?
భారతీయ యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలో జన్మతః ఒక దివ్యశక్తి నిద్రాణంగా ఉంటుంది. అదే కుండలిని. ఇది కేవలం ఒక తాత్విక భావన కాదు; ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక పరిణామ శక్తికి ప్రతీక. ఈ శక్తి జాగృతమైతే మనిషి తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆలోచనలు నిర్మలమవుతాయి. కోపం, భయం, ద్వేషం క్రమంగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, క్షమాగుణం సహజంగా వికసిస్తాయి. అయితే ఈ దివ్యశక్తి వికసించడానికి అత్యంత అవసరమైన నేల పవిత్రత. మురికినీటిలో తామర పువ్వు వికసించదు. అలాగే కలుషితమైన మనస్సులో దైవచైతన్యం పూర్తిగా వికసించదు.

నేటి సమాజం – పరుగు...
ప్రస్తుత కాలంలో వ్యక్తి విలువను అతని వ్యక్తిత్వంతో కాకుండా, అతని బాహ్య రూపం, వస్త్రధారణ, ఆస్తి, సామాజిక మాధ్యమాల్లోని ్రపాచుర్యం ఆధారంగా కొలిచే పరిస్థితి ఏర్పడుతోంది. అందంగా కనిపించడానికి గంటల సమయం వెచ్చిస్తాం. ఇతరుల ప్రశంసలు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అనే ఆందోళనలోనే జీవితాన్ని గడిపేస్తాం.

కానీ ఈ ప్రయాసలన్నీ బాహ్య ప్రపంచానికే పరిమితం. అవి మనసును శాశ్వతంగా తృప్తిపరచవు. అంతేకాదు, అనవసరమైన పోలికలు, అసూయ, అహంకారం, నిరాశలకు కూడా కారణమవుతాయి. ఈ పరిస్థితిలో మనిషి తనలోని సహజ శక్తిని బయట ప్రపంచం కోసం ఖర్చు చేస్తూ, తన ఆత్మసంపదను కోల్పోతాడు. శ్రీ మాతాజీ అందుకే హెచ్చరిస్తారు–‘‘ఇతరులను ఆకర్షించడానికి మీ శక్తిని వృథా చేయకండి. సాధువులలాగే జీవించండి.’’
– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు

నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement