సువార్త
ఘనమైన సువార్త నిర్వచనం ఇలా ఉంది. దీన్నే పౌలు సువార్త నిర్వచనం అంటారు కూడా.
‘...నేను ఏ సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను’ 1కొరింధీ 15:1–4.
క్రీస్తు మరణ సువార్తను మించిన సువార్త లేదన్నది బైబిలు ఉన్నత బోధ. దేవదేవుని గొప్పతనం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఈ సర్వ లోకానికి భిన్నమైన వైవిధ్యమైన ఆశ్చర్యకర తలంపులు దేవునివి. దేవుడు ఏది సువార్త అంటాడో అదే సువార్త. ఎందుకంటే క్రీస్తు మరణం దేవదేవుని స్వకీయ సంకల్పంలో నుండే వెలుగులోకి వచ్చింది.
ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ప్రకటించక సువార్తకు జ్ఞానం, స్వస్థత, సాక్ష్యాలు, ఇప్పటి భక్తుల చరిత్రలు, అభిషేకారాధన వంటివి అనేకనేకం కలుపుతూ సువార్త శక్తిని హరిస్తున్నారు. పెద్ద పాలకుండలోని చిక్కనైన పాలలో చిన్నపాటి బిందువు లాంటి విషపు చుక్కవేస్తే రంగు రుచి వాసన కోల్పోతూ ఆ పాలన్నీ విరిగినట్టే. సత్య వాక్యమను రక్షణ సువార్తకు అలా ఏది చేర్చినా అది తన శక్తి ప్రభావ మహిమలను వెనువెంటనే కోల్పోతుంది. సువార్తకు మరింత రుచి, సువాసన అన్న ఆలోచనలు చేసేవాళ్ళు తక్షణమే అవి విడనాడాలి.
సిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అయి ఉండగా కొత్తగా సువార్తకు జ్ఞానం అద్దడం దేనికీ? ఆత్మ స్వస్థతకు పాప రోగనివారణకు క్రీస్తు మరణిస్తే భౌతిక భావాలతో సువార్త స్వస్థత మహాసభలు దేనికీ? క్రీస్తు మరణ సువార్తకు ఏదీ కలుప కూడదు అనునదే అపొస్తలుల బోధలసారం.
సూచక క్రియలకు మించిన సూచక క్రియ క్రీస్తు ప్రేమకు కేంద్రమైన సిలువ. జ్ఞానానికి మించిన జ్ఞానం సిలువ వేయబడిన క్రీస్తులో కనబడుతుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది. సర్వ సంపూర్ణత క్రీస్తు బలియాగంలో ఒదిగి నిక్షిప్తమై ఉంది. ఇందు లేనిదంటూ ఏదీ లేదు. అలాగని సువార్తను మరుగు చేసేలా ఇందు ఒదిగిన అంశాల చుట్టూ సువార్త పేర్చడం కాక సువార్తకు ఏది కలుపక యథార్థమైన సువార్తను యధాతథంగానే ప్రకటించబద్దులము.
సువార్తకు ఎలాంటి ఆధారం ఏ ఊతం అవసరం లేదు. అది ఒంటరిగానే నిలబడి వ్యవహారం చక్కబెట్టగలదు. పరమ పరిశుద్ధ సువార్తను అంతే çపరిశుద్ధంగా... అంతే స్వచ్ఛంగా వెల్లడి చేయుట ద్వారా దేవుని మెప్పు అధికంగా పొందగలుగుతాం. ప్రకటనార్హమైనదిగా ఉంటూ వెళ్ళు ప్రకటించు అనదగ్గ క్రీస్తు సువార్తను అనుభవపూర్వకంగా రుచి చూస్తే మాత్రం దీనికి వేరే ఏది జతగా కలుపకూడదనేది ఇట్టే అర్థమవుతుంది.
మానవాళి ఆత్మలను రక్షించే శక్తిగల సత్యసువార్త గొప్పతనం ఏమంటే నేరుగా అది వచ్చి అపొస్తలుల చేతిలో పడడం. వీరిపై క్రీస్తు ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే వీరు ఆయన సువార్తకు న్యాయం చేసారు. సువార్తకు ఏదీ కలుపక క్రీస్తు మరణ సువార్తను ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించే విషయమై మనం అపొస్తలులను అభినందించక తప్పదు. ఎట్టి పరిస్థితులలోనూ క్రీస్తు మరణ సువార్తకు ఆయన జన్మను సైతం పౌలు కలుపకపోవడం గమనించదగ్గది. ఇట్టి అపొస్తలుల బోధకు, సువార్తకు విధేయులమై తలవంచుటే రక్షణ భాగ్యం. – జేతమ్
నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్


