ఇల్లు రెంట్‌ కోసం వెళ్లారు.. ఒక్కసారిగా నరకం చూశారు! | Punjab Couple Attacked By Pitbull Video Viral | Sakshi
Sakshi News home page

ఇల్లు రెంట్‌ కోసం వెళ్లారు.. ఒక్కసారిగా నరకం చూశారు!

Aug 13 2026 8:05 AM | Updated on Aug 13 2026 8:08 AM

Punjab Couple Attacked By Pitbull Video Viral

ఇల్లు చూసేందుకు వెళ్లారు.. గేటు తెరిచారు.. అంతే! ఒక్కసారిగా లోపలి నుంచి దూసుకొచ్చిన పిట్‌బుల్ కుక్క భార్యపై విరుచుకుపడింది. ఆమెను కాపాడేందుకు భర్త ముందుకొచ్చినా.. అతడినీ వదల్లేదు. క్షణాల్లోనే ఆ ప్రదేశం భీతావహంగా మారిపోయింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దంపతులు.. చేతుల్లో కర్రలు పట్టుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు.. చివరకు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భార్యాభర్తలు. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంజాబ్‌లోని పాటియాలాలో ఘుమన్ నగర్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

వివరాల మేరకు.. పాటియాలాకు చెందిన అంకిత్ సభర్వాల్ తన భార్య షిఫాలితో కలిసి ఓ ప్రాపర్టీ డీలర్‌తో ఇంటిని చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఇంటి గేటు తెరవగానే లోపలి నుంచి పిట్‌బుల్ ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి షిఫాలిపై దాడి చేసినట్లు అంకిత్ తెలిపారు. కుక్క ఆమె చేతితో పాటు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా దాడి చేయడంతో లోతైన గాయాలయ్యాయి. గాయాల తీవ్రత కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అంకిత్‌పైనా కుక్క దాడి చేసింది. అతడి కాళ్లు, వీపుపై లోతైన కాటు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న సీసీటీవీ వీడియోలో కుక్క దంపతులపై దాడి చేస్తుండటం కనిపిస్తోంది. వారు దాని నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుక్క వారిని వదలకుండా వెంటపడినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇక, కుక్క దాడిని ఆపేందుకు స్థానికులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఓ మహిళ చేతిలో కర్రతో ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కర్రలతో అక్కడికి చేరుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు తీవ్రంగా గాయపడిన దంపతులను దాని నుంచి దూరంగా తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు అంకిత్ తెలిపారు. కుక్కను స్వేచ్ఛగా బయటకు రానిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంటి గేటు తెరిచిన వెంటనే ఇంతటి ప్రమాదకర దాడి జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పాటియాలా మేయర్ కుందన్ గోగియా కూడా స్పందించారు. నగరంలో పిట్‌బుల్ వంటి దూకుడు స్వభావం కలిగిన కుక్క జాతులను పెంపుడు జంతువులుగా పెంచడాన్ని నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ సమావేశంలో చర్చించి ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement