విజయవాడ: కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా ఫోబియా’ పట్టుకుంది. మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై మరిన్ని కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200 పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 1,650 మంది ఎస్‌హెచ్‌ఓలు, సీఐ స్థాయి అధికారులతో సీఎం నేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
సాధారణంగా ఉన్నతాధికారులతోనే జరిగే సమీక్షలకు భిన్నంగా, ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయి సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఇవ్వడంపై పోలీస్ అధికారులు సైతం విస్తుపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ తరహా ఆదేశాలు ఇచ్చారని, భావప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


