సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హోంగార్డ్ వెంకటరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం వెంకటరాజును సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 25వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జైలుకు వెంకటరాజును పోలీసులు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన హోంగార్డు వెంకటరాజు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు దొరక్కుండా సీఐ నాగరాజు.. హెడ్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ వెంకట రాజును ఉపయోగించుకున్నట్లు తేలింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత ఈ ఏడాది మే 20వ తేదీన సిట్ అధికారుల విచారణలో వెంకటరాజు వాస్తవాలు చెప్పలేదు. వెంకటరాజుకి సీసీ కెమెరాల ఆపరేషన్‌లో అనుభవం ఉంది.
అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన ఘటనలో సాయికృష్ణ చనిపోయాడు. సాయికృష్ణ మృతదేహం మాయం చేయడానికి A4 సురేష్ సహకారం అందించాడు. సాయికృష్ణని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చిన, తీసుకెళ్లిన ఆధారాలను ధ్వంసం చేశారు. మే 14న కృష్ణలంక పోలీస్ స్టేషన్ స్టేషన్ సెల్లార్, స్టేషన్ అవుట్ డోర్, ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను తొలగించారు. అదే రోజు పోలీస్ స్టేషన్‌లో సీఐ రూమ్‌లో ఉన్న నాలుగు హార్డ్ డిస్క్‌లు తొలగించాలంటూ హెడ్ కానిస్టేబుల్ అశోక్.. హోం గార్డ్ వెంకటరాజుకి చెప్పాడు.
హార్డ్ డిస్క్ తొలగించిన తరువాత వాటిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో దాచారు. సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్‌లను తొలగించనట్లు అనుమానం రాకుండా సీసీ కెమెరాలను ఆన్‌లోనే ఉంచారు. తొలగించిన హార్డ్ డిస్క్ స్థానంలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఇన్‌స్టాల్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా హోంగార్డ్ హార్డ్ డిస్క్‌లు తొలగించి ఆధారాలు ధ్వంసం చేశాడు.
సాయికృష్ణ గురించి ఆధారాలేవీ దొరక్కుండా ఉండేందుకు కొత్త ఎన్‌వీఆర్, డీవీఆర్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో ఉండాల్సిన డేటాను ఉద్దేశ్య పూర్వకంగా అందరూ కలిసే తొలగించారు. ఆధారాలను, సాక్ష్యాలని ధ్వంసం చేయడం కోసం అందరూ కలిసి భాగస్వాములయ్యారు. సాయికృష్ణ లాకప్ డెత్ అవ్వడానికి ఏ1 నుంచి A6 వరకు అందరి పాత్ర ఉంది. ఒక పథకం ప్రకారమే A1 నుండి A7 వరకు ఆధారాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరా విజువల్స్ తొలగించడంలో నాగరాజు, అశోక్, వెంకట రాజు ముగ్గురు కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.


