సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుంచి పూర్తి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ (YSRTA AP) సహా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, ఇతర సర్వీస్ ప్రయోజనాల కోసం మళ్లీ టెట్ రాయాల్సి వస్తుండటం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్ నిబంధన గుదిబండగా మారిందని.. కేవలం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం కాకుండా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని కోరారు.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన వైఎస్ జగన్.. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రితో ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, TET నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు.


