సాక్షి, తాడేపల్లి: ప్రజా సమస్యలపై చట్టసభలో గళం విప్పాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చట్టసభ్యులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటానికి సభ్యులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మీటింగ్ సారాంశాన్ని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు..
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు ఈ అంశంపై పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని చట్టసభలో నిలదీస్తామని తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధిపై వైఎస్సార్‌సీపీ విమర్శలు
రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శలు చేసింది. ప్రజల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులపై కూడా సమావేశాల్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాయని, వారి సమస్యలపై కూడా పార్టీ తరఫున మాట్లాడతామని తెలిపారు.
ప్రతిపక్ష హోదాపై పోరాటం
అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు.. మూడోది లేదు కదా. అలాంటిది 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అలాగని చట్టంలో ఉంటే డిస్‌క్వాలిఫై చేయాలని బొత్స కోరారు.
‘‘రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నాం. ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదు. అయినా ప్రభుత్వాన్ని ఫేక్ పోలీసులతో నడిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావడం మన ఖర్మ. అందరి తరఫున అడుగుతాం. అన్ని ఆధారాలు చూపిస్తాం. అన్ని విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని బొత్స తెలిపారు.
మండలి వరకే..
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై నిరసనగా వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే నిర్ణయించింది. అయితే శాసన మండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. ఇక మండలిలో పార్టీ తరఫున డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.


