నేను రెడీ..: అమిత్‌ షా | I Am Ready: Amit Shah Challenges Opposition to Debate in Parliament | Sakshi
Sakshi News home page

నేను రెడీ..: అమిత్‌ షా

Aug 12 2026 12:15 PM | Updated on Aug 12 2026 12:20 PM

I Am Ready: Amit Shah Challenges Opposition to Debate in Parliament

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. విపక్షాలు లేవనెత్తుతున్న అన్ని అంశాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభలో చర్చకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.

బుధవారం పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమిత్‌ షా.. ఇటీవల రాజకీయ, పార్లమెంటరీ చర్చల్లో “లాపతా”, “భాగ్‌ గయే” వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అన్నారు. తాను పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా వస్తున్నానని, తన ఛాంబర్‌లోనే ఉంటున్నానని చెప్పారు.

అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ప్రశ్నించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ విపక్షాలే చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.

నీట్‌ అంశంపై చర్చకు సిద్ధం
నీట్‌ నిరసనల సమయంలో పోలీసుల చర్యపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్‌ షా తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.

“చర్చకు సమయం కేటాయించాలని, విపక్షాలు సిద్ధంగా ఉండాలని కోరాం. అదే వారి మొదటి డిమాండ్‌. దానికి ప్రభుత్వం అంగీకరించింది. నేను కూడా సభలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను” అని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు
విపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్‌ షా విమర్శించారు. “ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు 3 గంటల వరకు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను సభలో కూర్చొని అందరి అభిప్రాయాలు వింటానని, ప్రతి అంశానికి సమాధానం ఇస్తానని తెలిపారు.

దాచాల్సింది ఏమీ లేదు
ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని అమిత్‌ షా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని, పార్లమెంట్‌ సజావుగా నడవడానికి విపక్షాలు సహకరించాలని కోరారు.

సజావుగా సాగని సమావేశాలు
నీట్‌ నిరసనల అంశంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అమిత్‌ షా సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కొందరు నేతలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సజావుగా సాగలేదు. విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం పలు కీలక బిల్లులను ఆమోదించుకుంది. ఇప్పటివరకు ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.

రేపటితో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అమిత్‌ షా చర్చకు సిద్ధమన్న ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం-విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు చివరి రోజైనా తెరపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement