11వ అంతస్తులో మంటలు.. ముంబైలో విషాదం | Mumbai Fire Tragedy: Toddler Among Two Killed Six Injured | Sakshi
Sakshi News home page

11వ అంతస్తులో మంటలు.. ముంబైలో విషాదం

Aug 12 2026 7:49 AM | Updated on Aug 12 2026 7:49 AM

Mumbai Fire Tragedy: Toddler Among Two Killed Six Injured

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్‌లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.

భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్‌-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్‌-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

విద్యుత్‌ వైరింగ్‌ నుంచి మంటలు?
అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్‌ వైరింగ్‌, ఏసీ యూనిట్‌, ఫర్నిచర్‌, సోఫా, బెడ్‌, ఫాల్స్‌ సీలింగ్‌, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

చిన్నారి సహా ఇద్దరి మృతి
ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్‌ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్‌, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

గాయపడిన వారిలో ఫైర్‌మ్యాన్‌ మనోజ్‌ సోనావానే (30), శివమ్‌ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. మరో నలుగురు పార్థ్‌ (32), హిరెన్‌ (64), యశస్వి (33), అభిషేక్‌ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్‌ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement