సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలు, ఇతర అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుండగా.. ప్రతి వ్యూహంలో భాగంగా ఎన్డీయే ఎంపీలు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందనకు దిగారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పార్లమెంట్ ఆవరణలో అధికార ఎన్డీయే ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించిన ఎంపీలు.. విపక్షాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇదే ఆవరణలో.. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఇన్ని రోజులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం గమనార్హం.
పోటాపోటీ నిరసనలు..
పార్లమెంట్ ఆవరణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. ఎన్డీయే ఎంపీలు విపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలోనే విపక్షాల ఎంపీలు సైతం నిరసనకు దిగారు. ఎన్డీయే ఎంపీలేమో.. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. చర్చకు రావాల్సింది పోయి పారిపోతున్నారని ఆరోపిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి వ్యతిరేకంగా కూడా ఎన్డీయే ఎంపీలు నిరసన తెలిపారు.
దీనికి కౌంటర్‌గా ఇండియా కూటమి ఎంపీలు నీట్, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే ఎంపీలు కూడా నిరసనలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ నినాదాలతో హోరెత్తింది.
చర్చకు సిద్ధం.. ఎందుకు పారిపోతున్నారు?
విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్డీయే ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే విపక్షాలు చర్చకు రావాల్సింది పోయి.. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను స్తంభింపజేయడం సరికాదని ఆరోపించారు.
#WATCH | Delhi | NDA MPs protest against the Opposition, alleging they are running from discussion. BJP MP Sanjay Jaiswal says, "We are ready for disocussion but Rahul Gandhi is not. He has stalled the Lok Sabha. The Home Minister is ready to answer." pic.twitter.com/hUbmpRetdl
— ANI (@ANI) August 11, 2026
మోదీ నేతృత్వంలో మంతనాలు.. ఆ తర్వాత ర్యాలీ
ఎన్డీయే ఎంపీల నిరసనకు ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళ్ మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ పరిణామాలు, ప్రతిపక్షాల వ్యూహంపై చర్చించిన అనంతరం ఎంపీలు ర్యాలీ చేపట్టారు. విపక్షాల ఆందోళనలకు ప్రతిస్పందనగా అధికార పక్షం ఈసారి “రివర్స్ స్ట్రాటజీ” అమలు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Prime Minister @narendramodi waves the Tiranga along with all Ministers and MPs during NDA Parliamentary Party Meeting, Mangal Milan.#MangalMilan pic.twitter.com/PbgWdLaUBf
— All India Radio News (@airnewsalerts) August 11, 2026
గురువారంతో ముగియనున్న సమావేశాలు
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో చివరి రోజులు సజావుగా సాగాలని కేంద్రం కోరుతోంది. నిన్న ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉండటంతో సభకు ఆటంకాలు కలిగించవద్దని ప్రభుత్వం కోరుతోంది.
విపక్షాల డిమాండ్లు ఇవే
మరోవైపు విపక్షాలు మాత్రం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అయోధ్య రామమందిరం విరాళాల హుండీ చోరీ ఆరోపణలపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.
పార్లమెంట్‌లో పోరు.. బయటా నిరసనలు
ఒకవైపు విపక్షాల ఆందోళనలు.. మరోవైపు ఎన్డీయే ఎంపీల ప్రతిఆందోళనలు.. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ వేడికి వేదికగా మారింది. సమావేశాల చివరి రోజుల్లోనైనా సభ సజావుగా సాగుతుందా? లేదంటే రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.


