అమిత్‌ షా సిద్ధం.. తగ్గని విపక్షం | Amit Shah will address student protests in Parliament says Kiren Rijiju | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా సిద్ధం.. తగ్గని విపక్షం

Aug 11 2026 5:22 AM | Updated on Aug 11 2026 5:22 AM

Amit Shah will address student protests in Parliament says Kiren Rijiju

సభలో ప్రకటించిన రిజిజు

అయోధ్య విరాళాలపైనా చర్చించాలని విపక్షాల పట్టు 

నినాదాలతో స్తంభించిన ఇరుసభలు

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఉద్యమించిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాష్టీకం ఉదంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌కు హాజరై స్వయంగా వివరణ ఇవ్వాలన్న విపక్షాల డిమాండ్‌ అంశం మరోసారి లోక్‌సభ అర్ధంతరంగా ముగియడానికి కారణమైంది. హోం మంత్రి సభలో మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు ప్రకటించినా విపక్ష సభ్యుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరు ఆగలేదు. 

అయోధ్యలో రామమందిరంలో కోట్ల రూపా యల విరాళాల చోరీ ఉదంతంపైనా అమిత్‌షా ప్రకటన చేయాలని విపక్షసభ్యులు తమ పాత డిమాండ్‌కు పదునుపెట్టారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విపక్షాల ఆందోళనలు కొనసాగి చివరకు లోక్‌సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. 

మీరైతే పారిపోవద్దు: రిజిజు 
సోమవారం లోక్‌సభ ఆరంభమైన వెంటనే విపక్ష ఎంపీలు అమిత్‌షా ప్రకటన కోరుతూ ఆందోళనకు దిగడంతో కేవలం ఒక్క నిమిషంలో మధ్యాహ్నానికి, ఆ తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక సైతం విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబికా పాల్‌ విపక్షాలు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా విపక్ష ఎంపీలు శాంతించకపోవడంతో మంత్రి రిజిజు స్పందించారు. ‘‘సమావేశాల తొలిరోజు నుంచి కాంగ్రెస్, రాహుల్‌ గాం«దీలు హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని పట్టుబడుతున్నారు. 

ఈ అంశంలో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న యువత, విద్యార్థుల సమస్యలపై లోక్‌సభలో జరిగే చర్చలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్‌ షా సమాధానమిస్తారు. ఆయన సమగ్రస్థాయిలో సమాధానం ఇచ్చే సమయంలో విపక్ష సభ్యులు భయపడొద్దు. సభ నుంచి పారిపోవద్దు. వాకౌట్‌ లాంటివి చేయొద్దు. ఆయన ప్రసంగాన్ని మీరంతా పూర్తిగా వినాల్సిందే. ప్రసంగం మధ్యలో విపక్షసభ్యులు నినాదాలు ఇస్తూ అడ్డు తగలొద్దు’’అని రిజిజు అన్నారు.

 దీంతో విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలుచేశారు. ఇదే సమయంలో సభాధ్యక్షస్థానంలోఉన్న జగదాంబికాపాల్‌ అసహనం వ్యక్తంచేశారు. ‘‘ప్రభుత్వం ముందుకొచ్చి అమిత్‌షాతో మాట్లాడిస్తామని చెబుతోంది. ఇకనైనా విపక్ష సభ్యులు సభ సజావుగా సాగేలా ప్రవర్తించాలి. ఇదే వర్షాకాల సమావేశాలకు చివరి వారం. గత మూడు వారాలు నిష్ఫలంగా ముగియడానికి ఎవరు బాధ్యులు? చర్చలో మీరు పాల్గొనరా?’’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ విపక్షసభ్యుల నినాదాలు ఆగకపోవడంతో సభాధ్యక్షుడు చివరకు సభను మంగళవారానికి 
వాయిదావేశారు. 

రాజ్యసభలోనూ నిరసనలు.. 
రాజ్యసభలోనూ నిరసనల పర్వం కొనసాగింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. నిరసనల మ«ధ్యే రాజ్యసభలో పలు అధికారిక పత్రాలు, పార్లమెంటరీ స్థాయీ సంఘాల నివేదికలను మంత్రులు సభలో సమర్పించారు. విద్యుత్, బొగ్గు, గనులు, రక్షణ, జలశక్తి, పౌర విమానయాన శాఖలకు సంబంధించిన పత్రాలను సంబంధిత మంత్రులు సమర్పించారు. మరోవైపు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని మకర ద్వారం వద్ద ప్రతిపక్ష పారీ్టలు నిరసన చేపట్టాయి. విరాళాల చోరీ అంశంలో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని, ఘటనకు హోంమంత్రి బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.  

ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు ఆమోదం 
ట్రైబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘‘ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026’’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సోమవారం సభలో విపక్ష ఎంపీల నినాదాల నడుమ ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. ట్రైబ్యునళ్ల నియామకాల్లో పారదర్శకత, స్వతంత్రత, ఏకరూపత తీసుకురావడం, మెరుగైన పనితీరు లక్ష్యంగా ఈ బిల్లు తెచ్చారు. కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మారుస్తూ రూపొందించిన బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement