పార్లమెంట్ వర్షాకాల సెషన్‌లో మిగిలింది నాలుగు రోజులే
15 రోజుల్లో లోక్‌సభ పనిచేసింది 15.36 గంటలు మాత్రమే
ప్రతిపక్షాల పట్టుతో సందిగ్ధంలో ఎఫ్‌సీఆర్‌ఏ సహా కీలక బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. తీవ్ర ఆందోళనల కారణంగా దాదాపుగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రెండు వారాల సమయం గడిచిపోయింది. ఈ సెషన్‌లో ఇక మిగిలింది కేవలం నాలుగు రోజులు మాత్రమే. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ప్రతిష్టంభన తారస్థాయికి చేరడంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగడం కష్టమేనని అంటున్నారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విపక్షాలు...
పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, పెల్లెట్ గన్స్ ప్రయోగంపై హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే సభకు ఏ మంత్రి వచ్చి జవాబు చెప్పాలో ప్రతిపక్షాలు నిర్ణయించలేవని అధికార పక్షం తేల్చిచెప్పడంతో సభలో నిరసనల పర్వం కొనసాగుతోంది.
గందరగోళం మధ్యే 8 బిల్లులకు ఆమోదం
నిరసనలు, నినాదాల నడుమ లోక్‌సభలో 8 బిల్లులకు ఆమోదముద్ర పడింది. లోక్‌సభకు కేటాయించిన మొత్తం 90 పనిగంటల్లో సరిగ్గా నడిచింది కేవలం 15 గంటల 36 నిమిషాలు మాత్రమే. ఈ సమయంలోనూ సింహభాగం, దాదాపుగా 11 గంటలు ఒక్క పరీక్షల అక్రమ మార్గాల నివారణ సవరణ బిల్లు’పై చర్చకే వెచ్చించారు. ఈ బిల్లుపై 48 మంది ఎంపీలు మాట్లాడారు. మిగిలిన 7 ఇతర ముఖ్యమైన బిల్లులను విపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య సమగ్ర చర్చ లేకుండా కేవలం 36 నిమిషాల వ్యవధిలోనే సభ ఆమోదించేసింది. రాజ్యసభ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 15 రోజుల్లో ఎగువ సభ కేవలం 24.21 గంటలు మాత్రమే సమావేశమైంది.
మరో ఏడు కీలక బిల్లులు సిద్ధం
ఈ చివరి నాలుగు రోజుల్లో మరో 7 కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విదేశీ విరాళాల క్రమబర్థికరణ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, ‘గనులు–ఖనిజాల అభివృద్ధి సవరణ బిల్లు, ‘నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ‘కేరళ పేరు మార్పు బిల్లు’ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. రాజ్యసభలో ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు’, ‘పన్నుల సవరణ బిల్లు’లను ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. కీలక బిల్లులేవీ సోమవారం సభలో ప్రవేశపెట్టే అవకాశం లేదు. ముఖ్యంగాఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును అనుమతించేదే లేదంటూ కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. 10, 11, 12వ తేదీల్లో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది.
కుదరని సయోధ్య
సభలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని, రచ్చను నివారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఫోన్‌లోనూ మాట్లాడారు. డీలిమిటేషన్, ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లులపై సహకరించాలని కోరారు. అయినప్పటికీ, తమ డిమాండ్లపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో సయోధ్య సాధ్యం కాలేదు. విద్యార్థులపై దాడి, విరాళాల చోరీ అంశాలపై వెనక్కి తగ్గేది లేదని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను, వ్యూహాలను విపక్షాలు ఏ రకంగా అడ్డుకుంటాయో, పార్లమెంట్ చివరి నాలుగు రోజులు ఎలా సాగుతాయి అనేది చర్చనీయాంశమైంది.


