డ్రగ్స్‌ మత్తులో పైలట్‌? | Air India Pilot under the influence of drugs: Caught in screening test | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మత్తులో పైలట్‌?

Aug 10 2026 4:49 AM | Updated on Aug 10 2026 4:49 AM

Air India Pilot under the influence of drugs: Caught in screening test

స్క్రీనింగ్‌ టెస్ట్‌లో దొరికిపోయాడు

నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు డీజీసీఏ వెల్లడి  

ఫుకెట్‌–ఢిల్లీ విమానం కుదుపులకు లోనై ఎత్తును కోల్పోవడంపై దర్యాప్తు  

న్యూఢిల్లీ: ప్రధాన పైలట్‌ మాదక ద్రవ్యాలు తీసుకొని విమానం నడిపించాడా? అందుకే ఫుకెట్‌–ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురై, అకస్మాత్తుగా ఎత్తును కోల్పోయిందా? అంటే నిజమేనని అనుమానాలు బలపడుతున్నాయి. ఆ పైలట్‌కు స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) ఆదివారం ధ్రువీకరించింది. విమానం కుదుపులకు గురికావడం, ఎత్తు తగ్గడాన్ని ‘తీవ్రమైన సంఘటన’గా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు చేయనుందని తెలియజేసింది. 

ఇద్దరు పైలట్లలో ఒకరు విమానం దిగిన తర్వాత నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యారని, విచారణ పూర్తయ్యేవరకూ ఆ ఇద్దరినీ విమానయాన విధులకు దూరంగా ఉంచారని అధికార వర్గాలు ఇంతకుముందు వెల్లడించాయి. ఈ నెల 4వ తేదీన థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ2379(ఎయిర్‌బస్‌  అ320) అకస్మాత్తుగా కుదుపులకు గురై, సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయిందని డీజీసీఏ తెలిపింది. ఆ తర్వాత విమానం తిరిగి తన మార్గంలో స్థిరపడి, ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఆ సమయంలో విమానంలో ముగ్గురు పిల్లలతో సహా 137 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు. 

విమానం కుదుపులకు గురైనప్పుడు నలుగురు సిబ్బంది సహా మొత్తం 17 మంది గాయపడ్డారు. తర్వాత ఇద్దరు పైలట్లు మత్తు పదార్థాల వినియోగ నిర్ధారణ పరీక్షకు హాజరయ్యారు. పైలట్‌కు నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్టులో ‘నిర్ధారణ పరీక్ష అవసరమని’సూచించే ఫలితం వచి్చందని డీజీసీఏ పేర్కొంది. నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టంచేసింది. ఏఏఐబీ దర్యాప్తు, ప్రయోగశాల విశ్లేషణలో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని వివరించింది. 

అయితే, డోపింగ్‌ టెస్టులో ప్రధాన పైలట్‌(పైలట్‌–ఇన్‌–కమాండ్‌) విఫలమైనట్లు కనిపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. తుది ఫలితం రావాల్సి ఉందని పేర్కొన్నాయి. ఫుకెట్‌–ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌కు ప్రాథమికంగా నిర్వహించిన సైకోయాక్టివ్‌ పదార్థాల స్క్రీనింగ్‌లో మరింత విశ్లేషణ అవసరమని తేలడంతో, నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తుది నివేదిక వచ్చేదాకా ఏమీ చెప్పలేమని వివరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement